విశ్వాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు మెడిసిన్ సిద్ధమైనట్లు తాజా వార్త. ఇండియన్ ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును ఆవిష్కరించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ తాము విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ ప్రకటించింది. ‘ఫాబిఫ్లూ బ్రాండ్’ పేరిట ఈ మెడిసిన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం ఐసీఎంఆర్ సంస్థ నుంచి పొందినట్లు గ్లెన్ మార్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా ప్రకటించారు.
ఈ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని సంస్థ ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెన్మార్క్ చైర్మన్ గ్లెన్ సల్దన్హా చెప్పారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలిపారు. ఒక్కో మాత్ర ధర రూ.103 గా ఉంటుందని, కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలని, ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున వాడాలని సూచించారు. షుగర్, గుండె జబ్బులు గల వారు కూడా ఈ మాత్రలను వాడవచ్చని సంస్థ ప్రకటించింది.