ముందున్నది… వరంగల్, ఖమ్మం ‘ఎన్నికలు’!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎందుకింత హైరానా పడుతున్నది? దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం వైపు కన్నెత్తి చూడని సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం ఏ సంకేతాలను ఇస్తున్నది? ఇది మున్సిపల్ ఎలక్షనా? నేషనల్ ఎలక్షనా? అని బీజేపీ నేతల పర్యటనలపై ప్రశ్నించిన సీఎం కేసీఆర్ తానే స్వయంగా ‘స్థానిక’ ఎన్నికల సభలో పాల్గొనడం వెనుక గల లక్ష్యమేంటి? ఇవి రాజకీయ పరిశీలకుల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నల్లో కొన్ని మాత్రమే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము గెలవకుంటే హైదరాబాద్ ఆగమైతదని, రియల్ ఎస్టేట్ పడిపోతుందని తదితర వ్యాఖ్యలు కూడా సీఎం కేసీఆర్ నోటి నుంచి నిన్నటి సభలో వెలువడడం గమనార్హం.
వాస్తవానికి జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని అధిష్టించడం అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద గగనమేమీ కాదనేది అందరికీ తెలిసిందే. గణాంక వివరాల ప్రకారం కనీసం 20 డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెల్చినా, ఎంఐఎం మద్ధతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఎంఐఎం మద్ధతు అవసరం లేదనుకుంటే 65 డివిజన్లలో విజయం సాధించినా మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. ఆ పార్టీకి 37 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. గత ఎన్నికల్లో ముందే ప్రకటించిన ప్రకారం ‘సెంచరీ’ సీట్లలో 99 సీట్లను గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి 65 సీట్లు కూడా దక్కించుకోలేదా? ఇదీ తాజా సందేహం. ఎటునుంచి ఎటువైపుగా, ఎన్నిరకాలుగా లెక్కలు వేసినా మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. బీజేపీ మరీ అద్భుత స్థాయిలో వంద డివిజన్లలో విజయం సాధిస్తే తప్ప మేయర్ పీఠం అధికార పార్టీ చేజారే పరిస్థితులు లేవు. ఇదే జరిగితే తెలంగాణాలో రాజకీయ ముఖచిత్రం అనేక ప్రకంపనలకు హేతువు కావచ్చు.
ఈ పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. బహుషా దుబ్బాక చేదు ఫలితపు ప్రభావం కూడా కొంత కారణం కావచ్చు. తెలంగాణా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, నామినేటెడ్ పదవుల్లో గల నేతలు, చివరికి ఇతర మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా హైదరాబాద్ లోనే మకాం వేశారు. డివిజన్ల వారీగా తమకు పార్టీ అప్పగించిన బాధ్యతలను మోస్తున్నారు. సామాజిక సమీకరణల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, సభలు, సమావేశాలను అధికార పార్టీ నిర్వహిస్తున్నది. ఇంతగా చెమటోడుస్తున్నప్పటికీ, ఎన్నికల ప్రచారంలోకి సాక్షాత్తూ సీఎం కేసీఆర్ అడుగిడక తప్పలేదు. కాంగ్రెస్ సంగతేమోగాని, బీజేపీ మాత్రం అధికార పార్టీ నేతలను తీవ్రంగానే కలవరానికి గురిచేస్తున్నట్లుగానే ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో బీజేపీ గెల్చింది కేవలం నాలుగు డివిజన్లలో మాత్రమే. అధికార పార్టీ అభ్యర్థులు 99 డివిజన్లను దక్కించుకున్నారు. గత ఎన్నికలనాటి సానుకూల పరిణామాలు, పరిస్థితులు ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థులకు లేవనే సారాంశంతో వార్తా కథనాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు బీజేపీ వరుసగా జాతీయ నేతలను ఎన్నికల ప్రచారంలోకి దించుతున్నది. ప్రచారానికి చివరి రోజైన ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. అధికార పార్టీ నేతలు అంగీకరించినా, అంగీకరించకపోయినా మొత్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ప్రచార పర్వంలో బీజేపీపై అధికార పార్టీ నేతల మాటల దాడి ఇదే అంశాన్ని బోధపరుస్తోంది.
ఇంతకీ బీజేపీని అధికార పార్టీ ఎందుకింత సవాల్ గా పరిగణిస్తున్నది? ‘దుబ్బాక’ చేదు ఫలితమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలను మించి ఏ మాత్రం గణనీయ సంఖ్యలో గెల్చుకున్నా, దాని ప్రభావం రాబోయే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపైనా పడుతుంది. వరంగల్ నగరంలో బీజేపీకి కొంత పట్టు ఉన్నప్పటికీ, ఖమ్మంలో అంతగా లేదనే చెప్పాలి. కానీ గ్రేటర్ ఎన్నికల్లో గనుక బీజేపీ అనూహ్య సంఖ్యలో డివిజన్లను దక్కించుకుంటే, దాని ప్రభావం వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల ఎన్నికలపై తీవ్రంగా ఉంటుంది. వరంగల్, ఖమ్మం నగరాల్లో మరికొద్ది నెలల్లోనే జరగనున్న ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయ ఫలితాలు సాధిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణా రాజకీయ ముఖచిత్ర స్వరూపం పూర్తిగా మారిపోయే ప్రమాదముందని పరిశీలకుల అంచనా. ఎందుకంటే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో బీజేపీ ఇప్పటికే అధికార పార్టీకి సవాల్ విసురుతున్నది. ఈ ప్రమాదాన్ని పసిగట్టడం వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు కలవరపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.