జీహఎచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత లెక్కింపు మొదలైన పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ లో బీజేపీ ఆధిక్యత సాధించడమే ఇందుకు కారణం. అయితే ఈ ఫలితాలు మొత్తం ‘రిజల్ట్’కు సంకేతమా? అనే సందేహాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో ఉదయం 10.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 133 డివిజన్లలో వెలువడిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో బీజేపీ 82, టీఆర్ఎస్ 31, ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 డివిజన్లలో ఆధిక్యతను సాధించాయి. మరో 17 డివిజన్లలో ఎవరికీ ఆధిక్యత లభించలేదు. వీటిలో కొన్ని డివిజన్లలో ప్రధాన పార్టీలకు సమాన ఓట్లు లభించగా, ఇంకొన్ని డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ల వినియోగం లేదు. దీంతో సహజంగానే ఈ ఫలితాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మొత్తం ఫలితాలు కూడా ఇదే ఒరవడిలో ఉంటాయా? లేక విరుద్ధంగా ఉంటాయా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే సహజంగా పోస్టల్ బ్యాలెట్లను ఉద్యోగులకు ఇస్తుంటారు. విధి నిర్వహణలో గల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల వినియోగం ఇందుకు విరుద్ధంగా జరిగిందని ఉద్యోగ వర్గాలే చెబుతున్నాయి. స్థానిక ఉద్యోగులకు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డ్యూటీ కేటాయించలేదంటున్నారు.
రాష్ట్రంలోని జిల్లాలకు చెందిన ఉద్యోగులకు జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీ కేటాయించారని, వారికి అక్కడ ఓటు హక్కు ఉండే అవకాశమే లేదంటున్నారు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎక్కడివి? ఎవరు వినియోగించుకున్నారు? అనే ప్రశ్నలకు వస్తే, సీనియర్ సిటిజన్స్ కు, కోవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ల వినియోగానికి అవకాశం కల్పించారట. ఈ పరిణామాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఫలితంపై భిన్న వాదన వినిపిస్తోంది.
పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నవారు సీనియర్ సిటిజన్స్ కాబట్టి, వారంతా వైట్ కాలర్ ఓటర్లేనని, దీన్ని బట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను అంచనా వేసుకోవచ్చంటున్నారు. ఇదే దశలో సామాన్య కోవిడ్ పేషెంట్లు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం లేదని, ఇందులోనూ సంపన్నవర్గాలకు చెందిన ఓటర్లే ఉంటారనేది ఉద్యోగ వర్గాల అభిప్రాయం. అందువల్ల పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు ఏ సంకేతాలను ఇస్తాయనే అంశంపై ఓ అంచనాకు రావడానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల రిజల్ట్ ను ప్రామాణికంగా తీసుకోవచ్చని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ దూసుకుపోతున్నది. మొత్తం ఫలితాలకు ఈ పరిణామం సంకేతమా? కాదా? అనే విషయం మరికొద్ది గంటల్లోనే తేలనుంది.