గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల మనోగతంపై ప్రభుత్వ వర్గాలు నివేదికలు రూపొందించాయా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు వేర్వేరు ఇంటెలిజెన్స్ విభాగాలతోపాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా వివిధ పార్టీల గెలుపు, ఓటములపై నివేదికలను తయారు చేశాయా? ఆయా నివేదికలను పాలక వర్గాలకు సమర్పించాయా? అనే ప్రశ్నలకు ఔననే విధంగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఏ ఎన్నికల సందర్భంంలోనైనా పోలీసు శాఖకు చెందిన ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు తమదైన శైలిలో సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ పెద్దలకు నివేదికలు ఇవ్వడం కొత్త విషయమేమీ కాదు. కానీ ఆయా నివేదికలు బహిర్గతం కావడమనేది మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి.
ఇంటెలిజెన్స్ లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా విభాగాలు ఉంటాయి. వీటినే సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ గా వ్యవహరిస్తుంటారు. ఆయా విభాాగాల పనితీరుల్లోనూ అనేక అంశాల్లో చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది. స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం తరహాలోనే రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ విభాగం కూడా ఉంటుంది. అనేక అంశాల్లో సమాజంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు నివేదించడమే ఆయా విభాగాలకు చెందిన అధికారుల ప్రధాన విధులు. కానీ వివిధ ఎన్నికల సందర్భంగానూ పాలక వర్గాలు పార్టీల, గెలుపు ఓటములపై నివేదికలు తెప్పించుకోవడం కూడా సర్వసాధారణం. చాలా సందర్భాల్లో ఈ నిఘా విభాగాల నివేదికలు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాయనే ప్రచారం కూడా ఉంది. ఉన్నది ఉన్నట్లుగా నివేదించే పరిస్థితులు ఎప్పటినుంచో సన్నగిల్లాయనే భావనను కూడా ఆయా నిఘా విభాగాల అధికార వర్గాలు వ్యక్తం చేస్తుంటాయి.
ఇక అసలు విషయంలోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలపై ఓ వైపు సెంట్రల్, మరోవైపు స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగాలు వేర్వేరుగా నివేదికలు రూపొందించి పాలక వర్గాలకు సమర్పించాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రంలోని పెద్దలకు సమర్పించినట్లు పేర్కొంటున్న నివేదికలపై భిన్నరీతిలో ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగపు అధికారులు ఇచ్చిన నివేదిక అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు కూడా లీకైందంటున్నారు. దీంతో అప్రమత్తమైన పాలకపార్టీ పెద్దలు తమదైన శైలిలో మరోసారి రాష్ట్ర నిఘా విభాగాల ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గడచిన 10 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన అధికార పార్టీ నేతలు అనేక మంది ఇంకా జిల్లాలకు తిరిగి రాకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రచారం ముగిసినందున స్థానికేతరులు హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ, ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన పలువురు నాయకులు, వారి అనుచరగణం మాత్రం రాజధానిలోనే ఉండడం విశేషం. మంగళవారం పోలింగ్ ముగిసే వరకు కూడా పలు పార్టీలకు చెందిన నేతలు హైదరాబాద్ లోనే తిష్టవేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో సహజంగానే వివిధ పార్టీల విజయావకాశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.