గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫేక్ సర్వేలు, గాలి పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలింగ్ కు 48 గంటల ముందు ఎటువంటి ఒపీనియన్ పోల్స్ నిర్వహించరాదని ఎన్నికల సంఘం నిషేధం విధించినప్పటికీ ఫేక్ సర్వేల ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఫలానా పార్టీలకే ప్రజల మద్ధతు ఉందని పేర్కొంటూ కొన్ని సంస్థల పేరుతో నకిలీ సర్వే గ్రాఫిక్ డిజైన్లు తెగ తిరుగుతున్నాయి. విశేషమేంటంటే బాధ్యత గల కొందరు రాజకీయ నాయకులు సైతం ఇటువంటి ఫేక్ మెసేజ్ లను సోషల్ మీడియాలో షేర్ చేయడం.
రెండు జాతీయ సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించినట్లు గ్రాఫిక్ డిజైన్లను కొందరు సోషల్ మీడియాలో వదులుతున్నారు. అయితే ఈ సర్వేకు సంబంధించి ‘హేతుబద్ధత’ అంశాలేవీ అందులో లేకపోవడం గమనార్హం. ఏపీబీ-సీ ఓటర్, సీఎన్ఎన్ న్యూస్ 18 పేరుతో గ్రాఫిక్ డిజైన్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి తమ సంస్థ పేరుతో నకిలీ సర్వే నివేదిక సోషల్ మీడియాలో షేర్ అవుతోందని, దాన్ని ఎవరూ నమ్మొద్దని సీఎన్ఎన్ న్యూస్ 18 సంస్థ ప్రకటించింది.
నిజానికి అదో ఫేక్ రిపోర్ట్ అని, తమ సంస్థ ఎటువంటి సర్వే నిర్వహించలేదని ఆయా సంస్థ తన వెబ్ సైట్ ద్వారా స్పష్టం చేసింది. ప్రజలు ఇటువంటి నకిలీ సర్వే రిపోర్టులను నమ్మవద్దని, వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా ఆయా వెబ్ సైట్ తన వార్తా కథనంలో పేర్కొంది.