బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ సుడి తిరిగినట్లేనా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సాధిస్తున్న ఫలితాలు రాజకీయంగా సంజయ్ నాయకత్వానికి మరింత ఉత్సాహాన్నిస్తాయా? పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో సంజయ్ ఇమేజ్ మరింత పెరిగినట్లేనా? ఇదీ రాజకీయ వర్గాల్లో సాగుతున్న తాజా చర్చ. సరిగ్గా ఏడాదిన్నర క్రితం సంజయ్ ఓ సాధారణ కార్పొరేటర్ మాత్రమే. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యేగానూ ఓటమి చెందారు. కానీ ఆ తర్వాతే నేరుగా పార్లమెంటులో అడుగు పెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణా నుంచి అనూహ్యంగా ఎన్నికైన బీజేపీ ఎంపీల్లో సంజయ్ కూడా ఒకరు. ఆ తర్వాత తెలంగాణా బీజేపీ అధ్యక్షునిగా నియామకం.
ఇదిగో ఇక్కడి నుంచే సంజయ్ రాజకీయంగా తన దూకుడును మరింత పెంచారు. కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రాచుర్యం పొందిన సంజయ్ తమ పార్టీ బరాబర్ హిందూ పార్టీనే అంటుంటారు. ఇందులో మొహమాటం ఏమీ లేదు. పార్టీ కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపే వ్యాఖ్యలు చేయడంలో సంజయ్ దిట్ట. రాజకీయ ప్రత్యర్థులు వీటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా అభివర్ణిస్తుంటారనేది వేరే విషయం. కానీ సంజయ్ తెలంగాణా రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టాక అన్నీ శుభాలే జరుగుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అధికార పార్టీ శక్తి, యుక్తులను ఢీకొట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయం సహజంగానే సంజయ్ ఖాతాలో పడింది. అక్కడి ఎన్నికల్లో అభ్యర్థి రఘునందన్ రావు గొప్పతనంగానూ కొందరు అభివర్ణించవచ్చు. కానీ నాయకత్వపు ‘అకౌంట్’లోనే రిజల్ట్ పడుతుందనేది కాదనలేని వాస్తవం. అది విజయమైనా, అపజయమైనా కావచ్చు.
ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కూడా సంజయ్ నాయకత్వానికి మరింత ఉత్సాహాన్ని కలిగించేవేనని పేర్కొనడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో కేవలం నాలుగంటే, నాలుగు డివిజన్లను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు అధికార పార్టీకి సవాల్ విసిరే స్థాయిలో పోరాడుతున్నది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థులు 40 డివిజన్లలో విజయం సాధించగా, మరో 9 డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నారు. అనేక డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు వీరోచితంగా పోరాడి ఓడినట్లు కనిపిస్తోంది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ బలం స్పష్టమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బండి సంజయ్ నాయకత్వంపై ఆ పార్టీలోనే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ‘గ్రేటర్’ పరిధి దాటిన నాయకత్వం కొందరు నేతలకు రుచించకపోవచ్చు. ‘ఉరికించి కాళ్లు నరికే’ చందంగా కొందరు నాయకులు బీజేపీలోనూ ఉన్నారనే ప్రచారం ఎలాగూ ఉంది. అధికార పార్టీ కోవర్టులుగా వ్యవహరిస్తున్నట్లు మరికొందరు నేతలపైనా ఆరోపణల ప్రచారం కూడా ఉంది. ఇటువంటి అనేక పరిణామాల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. సంజయ్ నాయకత్వాన్ని మరింత బలపర్చిందనే వాదన అప్పుడే మొదలైంది కూడా. ఈ పరిణామాలపై సమాచారం ఉండడం వల్లే కావచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం సంజయ్ కి ఫోన్ చేసి మాట్లాడారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రకారం బండి సంజయ్ ఇప్పుడు ‘చిల్లర కార్పొరేటర్’ కాదు సుమీ. ఎక్కడో సుదూరాన ఉన్న బీజేపీని అధికార పార్టీ బలానికి అత్యంత చేరువగా నడిపిస్తున్న నాయకుడు కూడా. అన్నట్టు ‘ఉత్తమ్’ల వారి నాయకత్వపు పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో రెండు డివిజన్ల వద్దే చతికిలపడింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి దక్కింది రెండు డివిజన్లే కావడం గమనార్హం.