గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్డం కట్టినట్లు వివిధ సర్వే సంస్థలు కొద్ది గంటల ముందు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఇందులో అనేక సంస్థలు సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని సందర్భాల్లో నిజమవుతాయని, పూర్తిగా విఫలమవుతాయని కూడా చెప్పలేం. కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు దగ్గరగా కూడా ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తిరగబడిన ఉదంతాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన సంస్థల్లో కొన్ని దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఏం చెప్పాయో ఓసారి పరిశీలిద్దాం.
థర్డ్ విజన్ సర్వే:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 95-101 డివిజన్లలో గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ వెల్లడించింది. ఎంఐఎం 35-38, బీజేపీ 5-12, కాంగ్రెస్ 0-1 సీట్లు సాధించే అవకాశం ఉందని పేర్కొంది.
దుబ్బాక ఉప ఎన్నికపై: 51.54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు తొలిస్థానం లభించినట్టు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ తెలిపింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33.36 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 8.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడోస్థానంలో ఉన్నట్టు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ వెల్లడించింది.
ఆరా ఎగ్జిట్ పోల్స్:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 78(+/-7), బీజేపీ 28(+/-5), మజ్లిస్ పార్టీ 41(+/-5), కాంగ్రెస్ 3(+/-3) స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. టీఆర్ఎస్ కు 40.08 శాతం(+/-3%), బీజేపీ 31.21 శాతం(+/-3%), మజ్లిస్ పార్టీ 13.43 శాతం(+/-3%), కాంగ్రెస్ 8.58 శాతం(+/-3%), ఇతరులకు 7.70 శాతం(+/-3%) ఓట్లు పోలైనట్లు అంచనా వేసింది.
దుబ్బాకపై చెప్పిందేమిటంటే?: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆరా పోల్ సర్వే సంస్థ అప్పట్లో వెల్లడించింది. ఆ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు 48.72 శాత మేర ఓట్లు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికార పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ, మెజారిటీని భారీగా కోల్పోతుందని పేర్కొంది. భారతీయ జనతా పార్టీ రెండోస్థానంలో నిలుస్తుందని తెలిపింది. బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావుకు 44.64 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని అభిప్రాయపడింది.
పొలిటికల్ లాబొరేటరీ: ఈ సంస్థ పేరు గుర్తుంది కదా? దుబ్బాక ఎన్నికల్లో 47 శాతం ఓట్లను సాధించడం ద్వారా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధిస్తారని పొలిటికల్ లాబొరేటరీ అనే సంస్థ అప్పట్లో సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఈ సంస్థ సర్వేను నిజం చేస్తూ దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెబుతున్నదో తెలుసా? దిగువన గల ఆ సంస్థ రిపోర్టును చూడండి.