ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్ రావు రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన రత్నకుమార్ కు రెండు రోజుల క్రితమే వైద్య పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలోన చెన్నయ్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రత్నకుమార్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రత్నకుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధులతోనూ ఇబ్బంది పడుతున్న క్రమంలో చికిత్స కూడా తీసుకుంటున్నారు. రత్నకుమార్ మరణంతో ఘంటసాల కుటుంబంలోనేగాక చిత్రపరిశ్రమలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘంటసాల కుమారునిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగిడిన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుళ ప్రాచుర్యం పొందారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ తదితర భాషల్లో వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఏకధాటిగా ఎనిమిది గంటలపాటు డబ్బింగ్ చెప్పడం ద్వారా రత్నకుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించుకున్నారు.