రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు ఇచ్చిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా స్పందిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి వీలుగా అంబులెన్స్ వాహనాల కోసం విరాళాలను వెల్లువలా అందిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది అంబులెన్స్ వాహనాల కోసం నిధులను కేటీఆర్ కి స్వయంగా అందచేశారు.
తాజాగా బుధవారం వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్ పర్సన్, ఇతర నేతలు వాహనాలకు అవసరమైన చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ల సమక్షంలో కేటీఆర్ కు అందచేశారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన సతీమణి వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు ఒక వాహనానికి అవసరమైన నిధుల మొత్తపు చెక్కును అందజేశారు. అలాగే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరో వాహనం కోసం చెక్కుని అందచేశారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఒద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి, కాకులమర్రి లక్ష్మణ్ రావులు ఒక్కో వాహనానికి అవసరమైన చెక్కులను మంత్రుల సమక్షంలో కేటీఆర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా కరోనా బాధితులను ఆదుకోవడానికి అవసరమైన అంబులెన్స్ వాహనాల కోసం అనేక మంది ఎమ్మెల్యేలు, నేతలు చెక్కులు అందచేయడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం, కరోనా బాధితులను ఆదుకోవడం కోసం తమ తమ నియోకవర్గాల్లో నిరంతరం కృషి చేస్తున్న నేతలు ఇలా సేవకు ముందుకు రావడం వాళ్ళ ఔదార్యానికి నిదర్శనమన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, కేటీఆర్ పిలుపునకు స్పందించి అంబులెన్స్ వాహనాలకు అవసరమైన నిధులను ఇవ్వడం ఆయా నేతల ప్రజాసేవ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంటూ వారిని అభినందించారు.
ఫొటో: మంత్రి కేటీఆర్ కు చెక్కు అందిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గాయత్రి రవి, చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, మానుకోట ఎంపీ కవిత తదితరులు కూడా ఉన్నారు.