సంచలన అనుమానాలను వ్యక్తం చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, దర్యాప్తునకు గవర్నర్ కు వినతి
గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో దొరికిన ఏకే-47, స్టెన్ గన్ వంటి అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఈమేరకు నయీం తుపాకుల, దందాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయించాలని ఆ సంస్థ తెలంగాణా గవర్నర్ తమిళి సైని కోరుతూ వినతి పత్రం సమర్పించింది. నయీం ఇంట్లో దొరికిన 24 తుపాకుల్లో మూడు ఏకే-47, ఒక స్టెన్ గన్ కూడా ఉన్నాయని, ఇవి బహిరంగ మార్కెట్లో విక్రయించే ఆయుధాలు కావని పోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు. ఇటువంటి అధునాతన ఆయుధాలు సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా ఉండవని, ఇవన్నీ కూడా పోలీసు, మిలిటరీ చేతుల్లో ఉంటాయని, లేదంటే టెర్రరిస్టుల వద్ద ఉంటాయన్నారు.
మొదటి నుంచీ నయీం కేసులో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. నయీం ఇంట్లో దొరికిన వస్తువుల్లో 602 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వీటి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు జరిపితే నయీంకు తుపాకులు ఇచ్చినవారెవరో తేలుతుందని అన్నారు. నయీం వద్ద గల ఆయుధాల్లో కొన్ని స్మగుల్డ్ బాపతు కావచ్చని, మరి కొన్నింటికి లైసెన్సులు ఉండవచ్చన్నారు. అయితే లైసెన్సుడ్ తుపాకులకు ఆయుధ లైసెన్స్ ఇచ్చిన అధికారి ఎవరో బయటకు రావలసిన అవసరం ఉందన్నారు. నయీం కేసులో అధునాతన ఆయుధాలకు సంబంధించి పోలీసుల పాత్రపై తమకు అనుమానాలు ఉన్నాయని, వారి ‘బ్లెస్సింగ్స్’తోనే నయీం ఆయుధాలను సమకూర్చుకుని ఉంటాడని, విచారణ జరపాలని గవర్నర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు పద్మనాభరెడ్డి ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు. మొత్తంగా ఫోర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదుతో నయీం కేసు మరోసారి చర్చనీయాంశమైంది.