ఖమ్మం జిల్లా నాయకులతో గోక్కుని సీఎం సీటుకు ఎసరు తెచ్చుకున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను జెట్ స్పీడ్ తో విడుదల చేయడం విశేషం. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను నాలుగు సీట్లకు కేసీఆర్ నిన్న అభ్యర్థులను ఖరారు చేశారు. టికెట్లు ఖరారైనవారిలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలుండగా, మరో మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఉన్నారు. ఇందులో ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి తన సమీప బంధువు బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. గడచిన రెండు రోజులుగా ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఏకాభిప్రాయంతో ఈ నలుగురు పేర్లను ఖరారు చేసినట్లు ప్రకటించారు. అయితే ఈ నాలుగు సీట్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ముడిపడి ఉన్న రెండు పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పరిస్థితిపై రాజకీయ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.
ముందుగా ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని విశ్లేషించినట్లయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించలేదు. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐ, మిగతా ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ ఆరు సెగ్మెంట్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్నారు. వీరీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, పాలేరు, ఖమ్మం సెగ్మెంట్లు పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉన్నాయి. మిగతా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ ఆధిక్యతతోనే విజయం సాధించారు. మొత్తంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన మెజారిటీ ఓట్ల సంఖ్య 2.70 లక్షలు.
అంటే మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వర్ రావు గెలుపు సాధించాలంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. నామ గెలుపునకు హృదయపూర్వకంగా కృషి చేసే బీఆర్ఎస్ లీడర్లు ఎవరనే అంశంపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలో గల అంతర్గత కుమ్ములాటలే ఇందుకు నిదర్శనంగా బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. అనేక నియోజకవర్గాలలో పార్టీ కేడర్ కు కనీసం ధైర్యం చెప్పే పరిస్థితులు లేవంటే అతిశయోక్తి కాదు. కొందరు ‘మాజీ’లైతే మొన్నటి వరకు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గత ఎన్నికల్లో అనూహ్యంగా తన టికెట్ ను లాక్కున్న తరహాలో రాజకీయం నెరపిన నామ నాగేశ్వర్ రావును ఓడించే విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుసరించే వ్యూహం, ఎత్తుగడలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. ఇటువంటి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటూ నామ నాగేశ్వర్ రావు అధికార పార్టీ అభ్యర్థితో తలపడాల్సి ఉంటుంది.
అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనూ బీఆర్ఎస్ పరిస్థితి మరింత దయనీయమనే చెప్పాలి. నియోజకవర్గ పరిధిలో భద్రాచలం మినహా మరెక్కడా బీఆర్ఎస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. నియోజకవర్గంలోని మానుకోట, డోర్నకల్, నర్సంపేట, ములుగు, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకీ 2.47 లక్షల ఓట్ల ఆధిక్యత లభించింది. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు లభించిన మెజారిటీ కేవలం 5,179 ఓట్లు. వెంకట్రావు ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఇటు ఖమ్మం, అటు మానుకోట ఎంపీ సీట్లలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేని పరిణామాల్లో నామ నాగేశ్వర్ రావు, మాలోత్ కవితలు ఎన్నికల్లో పోరాడాల్సి ఉంది. మానుకోట పార్లమెంట్ పరిధిలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క ప్రాబల్యం గురించి కొత్తగా చెప్పకునేదేమీ లేదు.
మరోవైపు ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు అధికార పార్టీ తరపున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగానూ ఉన్నారు. ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం పొంగులేటి ప్రతిష్టకు సవాల్ గానే చెప్పవచ్చు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వనని ప్రతిన బూనిన పొంగులేటి శపథం 90 శాతం నెరవేరిందనే చెప్పాలి. ఆయా అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకున్నపుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లతో ముడిపడిన ఖమ్మం, మానుకోట పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం అంత ఈజీ కాదనేది సుస్పష్టం. అంతిమంగా టికెట్లు దక్కాయి సరే.. ఎన్నికల్లో గెలిచేదెలా? అనేది బీఆర్ఎస్ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు, మాలోత్ కవితల ముందున్న అసలు ప్రశ్న.
ఇమేజ్: ఖమ్మం, మహబూబాబాద్ నాయకులతో కేసీఆర్ సమావేశం నిర్వహించిన దృశ్యం