పురుషులందు పుణ్య పురుషులు వేరయా…అన్నారు వేమన. కేలండర్లలో భార్యా బాధితుల సంఘం కేలండర్ వేరయా అంటున్నారు కొందరు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం పెంటపాడుకు చెందిన భార్యా బాధితుల సంఘం 2020 సంవత్సరానికి కేలండర్ ను ప్రచురించి పంపిణీ చేస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూాడా సదరు బాధిత సంఘం కేలండర్ ను ప్రచురించడం విశేషం. ఈ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా జి. బాలాజీరెడ్డి, విశాఖపట్నం అధ్యక్షునిగాఎం. రమేష్ పేర్లను ఉటంకిస్తూ ఈ కేలండర్ ను రూపొందించారు. తమ సంఘం తరపున భార్యా బాధితులు, అత్త, ఆడపడుచులు, వదిన, మరదళ్లు, ఉద్యోగ, నిరుద్యోగ రాజకీయ పార్టీ కూడా ఉన్నట్లు కేలండర్ లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో ఈ కేలండర్ ను పంపిణీ చేస్తున్నారు. కేలండర్ పేజీల్లో దిగువన ‘ఓ భార్యా బాధితులారా ఏకం అవ్వండి’ అనే స్లోగన్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణాలోనూ ఇటువంటి సంఘం ఒకటి ఉందండోయ్. కరీంనగర్ పట్టణంలో నివసించే బండి శ్రీనివాస్ అనే భార్యా బాధితుడు తెలంగాణా రాష్ట్ర భార్యా బాధితుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. తమ సంఘంలో 98 వేల మంది సభ్యులు ఉన్నారని, గతంలో కరీంనగర్ కేంద్రంగా ఆఫీసు నిర్వహించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం తమ వద్దకు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారం కోసం తామే వారి వారి ప్రాంతాలకు వెడుతున్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణా భార్యా బాధితుల సంఘం కేలండర్ ను ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేసేందుకు కార్యాచరణ రూపొందించామని శ్రీనివాస్ పేర్కొన్నారు.