పోలీసులు మరీ మెతగ్గా ఉన్నా బాగోదు. ఇదిగో ఇలాగే ఉంటుంది మరి. పోలీసులంటేనే కర్కశత్వమనే పేరు ఇప్పటికీ పూర్తిగా తొలగి పోలేదనుకోండి. అది వేరే విషయం. కానీ తెలంగాణా పోలీసులు ప్రజలతో ‘ఫ్రెండ్లీ’గా ఉండాలని కదా? ఆ శాఖకు చెందిన పెద్ద సార్లు ఆదేశించింది. ఈమేరకు అనేక విషయాల్లో పోలీసుల ప్రవర్తనలో మార్పు వచ్చిందనేగా మనం నమ్ముతోంది. ఇంకా నమ్మశక్యం కాని వారికి ఇదిగో ఈ చిత్రమే పెద్ద ఉదాహరణ.

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెట్రోలింగ్ వాహనాన్ని టెంపుల్ ఎంక్వయిరీ ఆఫీసు వద్ద పార్క్ చేసిన దాని డ్రైవర్ ఏదో పని మీద వెళ్లి ఉంటారు. లేదంటే రాజన్న దర్శనానికే వెళ్లి ఉంటారు. మొత్తానికి అక్కడ లేనట్లుంది. ఇదే సమయాన్ని కొందరు భక్తులు అదునుగా తీసుకున్నట్లున్నారు. ఇంకేముంది పెట్రోలింగ్ వాహనాన్ని తమ బట్టలు ఆరేసుకోవడానికి ఇలా ఉపయోగించుకున్నారు. తెలంగాణా పోలీసులు ఎంత ‘ఫ్రెండ్లీ’ అయితే మాత్రం మరీ ఇలా భయం, భక్తీ లేకుండా బట్టలు ఆరేయడం బాగుందా…? చెప్పండి. తప్పు కదా?

Comments are closed.

Exit mobile version