మాజీ సైనికోద్యోగుల, స్వాతంత్ర సమరయోధుల సమస్యల పరిష్కారానికి ‘‘చంద్రశేఖర లా ఛాంబర్స్’’ ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందించనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయవాది, ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ప్యానల్ అడ్వకేట్ ఎల్.టి. చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ సైనికులు, సమరయోధుల సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి భూములు కేటాయించగా కొందరు సాగు చేసుకుంటున్నారని, మరికొందరు ఇప్పటికీ ఆ భూములను పొందలేక పోయారన్నారు. సాగులో ఉన్న కొందరు తమ కుటుంబ అవసరాలకు ఆ భూములను అమ్ముకొనే క్రమంలో నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షను సర్టిఫికేటు / ఎన్.ఓ.సి.) లేక ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ క్రమంలో ఎన్.ఓ.సి. తదితర సమస్యల పరిష్కారానికి ప్రతి ఆదివారం హైదరాబాద్ ఎల్.బి.నగర్ లోని తమ కార్యాలయంలో నేరుగా గానీ, 9440328586 నంబరులో గానీ సంప్రదించి ఉచిత న్యాయ సలహాలను పొందవచ్చని చంద్రశేఖర రావు తెలిపారు. తనతోపాటు ‘‘చంద్రశేఖర లా ఛాంబర్స్’’ న్యాయవాదులు గోపాల బాలరాజు, ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బి.డేవిడ్, కొత్తా చంద్రశేఖర్ రెడ్డి కూడా తమ సేవలందిస్తారని, మాజీ సైనికులు, స్వతంత్ర సమరయోధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.