ఔను..అర్జంటుగా షేర్ చేయండి. అన్ని గ్రూపులకు తొందరగా పంపించండి. లేదంటే కొంపలంటుకుంటాయ్ సుమీ. పేద విద్యార్థులు తమ జీవితంలో ఎంతో నష్టపోతారు. ఆలసించిన ఆశాభంగం. భలేమంచి ఉచిత బేరం. తెలియనివాళ్లు తెలుసుకుని అప్లయ్ చేస్తారు. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? పూర్తిగా తిరగ రాస్తే బాగోదుగాని… ముందు దిగువన గల ఓ సోషల్ మీడియా పోస్టును యధాతథంగా చదవండి. తర్వాత అసలు సంగతేమిటో తెలుసుకుందాం.
అన్ని గ్రూప్ లకు తొందరగా పంపించండి
తెలియనివాళ్ళు తెలుసుకొని apply చేస్తారు
OC, విద్యార్దిని/ విద్యార్థులకు
ఉచిత రెసిడెన్సియల్
ఇంజనీరింగ్ విద్య (B.Tech&M.tech). At Vijayawada(Tenali)
ఇంజనీరింగ్ చదవాలని ఆశక్తి వుండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తెలియజేయండి.
B.tech And M.tech..
Free education
*1 km Near Bus stand.
*1.5km near Railway stn.
*No Ragging at college area.
*Daily Sports and Games.
*Mineral Drinking water.
*Co-education college.
*Highly secure labs.
* Highly protected cc-cameras.
*Jobs in campus selection conducted by top 10 company’s of INDIA.
వివరాలకు:
*V.Pavan Kumar
Cell : 9398174203
8886310400
ముఖ్య గమనిక:
1.నో హాస్టల్ ఫీజు
2. నో కాలేజ్ ఫీజు.
3.నో బిల్డింగ్ ఫీజ్.
4.నో యూనివర్సిటీ ఫీజ్.
ఇతర గ్రూపులకు పంపండి
పేద విద్యార్దులకు సహాయంచేయండి.?
కాసింత పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!✍✍✍✍
ఓకే..చదివారు కదా? సోషల్ మీడియా పోస్టే కదా? మన మైబైల్ లోని వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వార్డ్ చేస్తే పోలా? పేద విద్యార్థులకు సాయం చేసినట్లవుతుందని ఖర్చులేని దాతృత్వం కోసం అప్పుడే తహతహలాడకండి. అక్కడే ఉంది అసలు మతలబు. కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే.. ఆ ఫీజులు కూడా లేకుండా ఇంజనీరింగ్ చదవాలని ‘ఆశక్తి’ ఉండి, ఆర్థికంగా వెనుకబడిన వారికోసమే కదా ఈ పోస్ట్? అగ్ర కులాలవారికి కూడా ఉచిత రెసిడెన్షియల్ అంటూ ఊదరగొట్టారు కదా? అద్బుతం కదూ? ఎవరబ్బా..ఈ ఉచిత రాజశేఖరుడు అనుకుంటున్నారా? మన తెనాలి వారే. అదేదో ట్రస్టు అంట. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గారి భర్త పేరున ఉన్నదట. ఆయనెవరో, ఎంపీగారెవరో చెప్పారు గాని, పేరు రాస్తే మరీ బాగోదు.
అంతా ఉచితమే కదా? ఇంకేంటి ఆలస్యం.. అని ఉరకలేయకండి అప్పుడే. అనేక మందిలాగా ఈ సోషల్ మీడియా పోస్టును మరో గ్రూపులోకి పంపించడానికి మనస్కరించలేదు. జర్నలిస్టిక్ బుర్ర కదా? ఎక్కడో అనుమానం కలిగింది. నిశిత పరిశీలనతో చదవగా అనేక సందేహాలు మొలకెత్తాయి. విషయమేమిటో కనుక్కుందామని పోస్టులోని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే సంబంధిత వ్యక్తి ఏమన్నారో తెలుసా? కాలేజీలో చదువు ఉచితంగానే చెబుతారట.. కానీ ఫీజు రీయింబర్స్ మెంటు ద్వారా ప్రభుత్వం నుంచి తమ వద్ద చేరిన విద్యార్థుల పేరుపై నిధులు మాత్రం స్వీకరిస్తారట. ఓసీ విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత వసతి అని కూడా పేర్కొన్నారు కదా? దాని సంగతేమిటని నిలదీస్తే.. నిర్ణీత మొత్తంలో డబ్బు వసూలు చేస్తామని సెలవిచ్చారు. ఇంకా చాలా చెప్పాడు లెండి సదరు ‘ఫోన్ నెంబర్’ యజమాని. అనేక కొర్రీలు చెబుతూ ఏవేవో రూపంలో డబ్బు చెల్లించాల్సిందేనట. అదీ అసలు సంగతి. తమ కాలేజీలో ఖాళీగా ఉన్న సీట్లను నింపుకునే సరికొత్త ఎత్తుగడ అన్నమాట.
ఏపీలో పేద విద్యార్థుల చదువులకు భరోసా కల్పిస్తూ ‘జగన్ మామ’గా స్వయం ప్రకటన చేసుకున్న ముఖ్యమంత్రి దృష్టికి ఈ పోస్ట్ వెళ్లిందో లేదో? ఎందుకంటే… జగన్ సర్కార్ ఉచిత విద్యా పథకానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ (?)గారి కాలేజ్ ఇస్తున్న ఈ డబుల్ ధమాకా ఆఫర్ గట్టి పోటీ ఇచ్చేట్టుగానే ఉంది. ఈ మాత్రం దానికి తెనాలి వరకు వెళ్లాలా? మా ఊళ్లో ఇంజనీరింగ్ కాలేజ్ లేదా..అంటారా? అయితే ఓకే. ఇప్పుడు చెప్పండి? షేర్ చేస్తారా.. సదరు సోషల్ మీడియా పోస్టును ఆలస్యం చేయకుండా!