ప్రేమిస్తున్నానని వలపు వల వేసి నిరుద్యోగుల నుంచి రూ. లక్షలు వసూలు చేసిన నయవంచక ముఠాను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కొంత నగదుతోపాటు నకిలీ అపాయింట్మెంట్ లెటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి కథనం ప్రకారం… మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతి MLT చదివి ఊద్యోగం లేక ఖాళీగా ఉంటూ కుటుంబ సభ్యులతో విడిపోయి కరీంనగర్లోని ఆదర్శ నగర్లో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వారికి ప్రేమ పేరుతో, ఊద్యోగాల నెపంతో మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి లక్షలో డబ్బులు వసూలు చేస్తుంటుంది.
ఇటువంటి మోసాల్లో నిందితురాలైన యువతి తన ముఠా సభ్యులతో కలిసి కరీంనగర్ లోని సిఖ్వాడి ప్రాంతానికి చెందిన యువకుని వద్ద వరంగల్ లోని ప్రభుత్వ ఆస్పుత్రిలో ఊద్యోగం ఇప్పిస్తానని, క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో పదమూడున్నర లక్షల రూపాయలు వసూలు చేసింది. అదే విధంగా కరీంనగర్ లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరొక వ్యక్తి వద్ద ప్రభుత్వ ఊద్యోగం పేరుతో ఏడు లక్షల రూపాయలు వసూలు చేశారు. గోదావరిఖనికి చెందిన మరొక యువకుని వద్ద మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది. వరంగల్ కు చెందిన యువకునితో నికితరెడ్డిగా పరిచయం చేసుకొని అతనితో సన్నిహితంగా మాట్లాడుతూ, అతనితో చాటింగ్ చేసిన సంభాషణలు భద్రపర్చుకొని అతనిని బ్లాక్ మెయిల్ చేస్తూ అతని వద్ద నుండి ఎనిమిది లక్షల రూపాయలు వసులు చేసింది.
నిందితురాలు తాను సంచరించే ప్రాంతాలలో ఊద్యోగాలు లేని అమాయక యువకులను గుర్తించి వారికి తాను కరీంనగర్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, వరంగల్ MGM హాస్పిటల్ లో కూడా విధులు నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకుంటుంది. తనకు అధికారుల వద్ద పలుకుబడి ఉన్నట్లు నమ్మించి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని , క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మిస్తుంది. అందుకు రిజిస్ట్రేషన్, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించి తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి అమాయక యువకుల వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ వస్తుంది.
మరి కొన్ని సందర్భాలలో తాను వరంగల్ లోని ప్రముఖ వైద్యురాలి కుమార్తె నికితరెడ్డిగా పరిచయం చేసుకొని వారితో స్నేహం పేరుతో సెల్ ఫోన్ సంభాషణలు ప్రారంభిస్తుంది. వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని శృంగారపు మాటలతో రెచ్చ గొడుతూ వారి వాట్సప్ చాటింగులు, ఫోన్ సంభాషణల రికార్డింగులను భద్రపర్చుకుంటుంది. తర్వాత వారిని కూడా ఊద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేస్తుంది. బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి తిరిగి డబ్బులు అడిగితే తన మూఠా సభ్యులను పెద్ద మనుషులుగా చూపించి భద్రపర్చిన చాటింగులను, సంభాషణలను చూపిస్తూ ఎదురు కేసులు పెడతానని యువకులను బెదిరింపులకు గురి చేస్తుంది .
ఆయా విధంగా అనేక మోసాలకు పాల్పడిన బెల్లంపల్లికి చెందిన ఓ యువతిని, ఆమె ముఠాలోని కంబాల రాజేష్, కుసుమ భాస్కర్, భీమా శంకర్ లను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 20 వేల నగదు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై కరీంనగర్ వన్ టౌన్, హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి, వరంగల్ మిల్స్ కాలనీ, గోదావరి ఖని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు వివరించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మిస్తూ అమాయకుల మోసం చేసే వారి మాయమాటలు నమ్మి డబ్బు, సమయం నష్ట పోవద్దన్నారు. అలాంటి మోసగాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పితే వారి సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. ఇటువంటి మోసగాల్లపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని, ఇప్పటికే పలువురు ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టినట్లు కూడా ఆయన తెలిపారు.