తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ వ్యవహారాలు చూసే అదనపు కార్యదర్శినంటూ బురిడీ కొట్టిస్తూ, మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న ఓవ్యక్తిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, తాను అడిషనల్ సెక్రెటరీగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాల వ్యవహారాలను చూస్తున్నట్లు పేర్కొన్నాడు.
అంతేగాక అవినీతి నిరోధక కమిషన్ కరీంనగర్ జిల్లా చైర్మన్ గా కొనసాగుతున్నానని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వివిధ రకాలుగా మోసం చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కథనం ప్రకారం… కరీంనగర్ లోని విద్యానగర్ లో నివాసముంటున్న దులిగుంటి సాయి చందన్ (23) స్వగ్రామం తిమ్మాపూర్ మండలంలోని మొగలిపాలెం. ప్రజలను వివిధ రకాలుగా మోసం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ ఫర్ సీఎం ఫ్యామిలీ ఎఫైర్స్ గా పేర్కొంటున్నాడు. తనను ముఖ్యమంత్రి కార్యదర్శి పి. రాజశేఖర్ రెడ్డి నియమించినట్లుగా ధ్రువపత్రాన్ని తయారుచేశాడు. అలాగే కరీంనగర్ జిల్లా అవినీతి నిరోధక కమిషన్ చైర్మన్ గా కూడా నకిలీ కార్డును తయారుచేసుకున్నాడు.
ఆయా గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ బలగాలు ఎల్ఎండి పోలీసుల సహకారంతో శనివారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఆర్ ప్రకాష్, శశిధర్ రెడ్డి, ఎస్ఐ కరుణాకర్, ఎల్ యండి ఎస్ఐ కృష్ణారెడ్డి, టాస్క్ ఫోర్స్, LMD పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు పాల్గొన్నారు.