పరస్పర కాల్పుల ఘటనలో నలుగురు జవాన్లు మరణించిన ఘటన తెలంగాణా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన మరో జవాన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఇదే ఘటనలో ఇంకో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భద్రాచలం సరిహద్దుల్లో గల ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఈ కాల్పుల ఘటన జరిగింది. దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం బేస్ క్యాపు సమీపంలోనే గల లింగంపల్లిలోని మరో బేస్ క్యాంపులో సీఆర్ఫీఎఫ్ 50వ బెటాలియన్ కు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ చెలరేగింది. సెలవుల అంశంలో చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారి తీసి, ఆ తర్వాత కాల్పుల వరకు వెళ్లినట్లు సమాచారం.
ఈ సందర్భంగా జవాన్లు తుపాకులు తీసి పరస్పరం కాల్పులకు దిగడంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో జవాన్ చికిత్స కోసం తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలతోపాటు గాయపడినవారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.