సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను ఉటంకిస్తూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పీసీసీ అధ్యక్షునిగా నియమితుడైన రేవంత్ రెడ్డి గురువారం రేణుకా చౌదరిని హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ముఖ్య నేతలంతా కనిపిస్తున్నారు… కానీ భట్టి విక్రమార్క కనిపించడం లేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రేణుకా చౌదరి ఏమన్నారంటే…

‘ఆయనకి ఢిల్లీకేదో పిలుపొచ్చిందటండీ, అర్జంటుగా పిలుపొచ్చిందని ఏదో చెప్పారు… అందుకే అటు వెళ్లి ఉంటారు… మొన్న ఏదో షోకాజ్ నోటీస్ ఏదో ఒచ్చిందని… నాకు తెల్వదు.. అని ఇట్ల ఊహాగానాలు… సో.. మాకు తెలియదు.. తప్పకుండా ఆయన సీఎల్పీ లీడర్, పెద్దమనిషి, మాకు క్యాంపెయిన్ కమిటీ చైర్మెన్ గా ఉన్నవారు… అన్ని విధాలు… అన్ని పోస్టులు అలంకరించినవారు… తప్పకుండా ఇవ్వాళ ఒచ్చి ఉండేవారు… కాకపోతే ఇంకేదో అర్జంటు మ్యాటరొచ్చి ఆయన అటు వెళ్లాల్సి వచ్చింది… లేకపోతే ఇక్కడ ఉండేవారు.. థాంక్యూ.’ అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం. మాకు తెలియదంటూనే ‘షోకాజ్ నోటీస్’ అనే పదాన్ని రేణుకాచౌదరి ఉచ్ఛరించడం కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేణుకా చౌదరి ఇంకా ఏమన్నారో దిగువన గల లింక్ ద్వారా చూడవచ్చు… వినవచ్చు.

Comments are closed.

Exit mobile version