తెలంగాణా సీఎం కేసీఆర్ పలు అంశాల్లో ‘యూటర్న్’ తీసుకుంటున్నారనే వార్తల నేపథ్యం తెలిసిందే. కేసీఆర్ తాజా నిర్ణయాలపై రాజకీయ పక్షాల అభిప్రాయాలు సహజమే. కానీ సుదీర్ఘ కాలం విప్లవోద్యమంలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత ఏమంటున్నారు? సీఎం కేసీఆర్ ఈ వైఖరిని అవలంభించడం వెనుక గల కారణాలను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న తనదైన శైలిలో విశ్లేషించారు. దశాబ్ధాల అజ్ఞాత జీవితంలో విప్లవ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న జంపన్న కేసీఆర్ తాజా వ్యవహారశైలిపై స్పందిస్తూ, తన ఫేస్ బుక్ పేజీలో అంశాల వారీగా అభిప్రాయపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలపై జంపన్న ఏమన్నారో దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవచ్చు.

కేసీఆర్ యూటర్న్ లో…
1) కేంద్రం నుండి నిధులు రాబట్టడం.

2) ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత నేపధ్యంలో టీఆర్ఎస్ నుంచి వలసలు పెరగకుండా అపడం.

3) బీజేపీ దాడిని తగ్గించడం.

4) పెరిగిన ప్రజా వ్యతిరేకతను తగ్గించే నష్ట నివారణ చర్యలు.

5) చుట్టుముట్టిన దాడి నుండి కొద్దికాలం ఊపిరి పీల్చుకోవడం.

6) అర్థిక నేరాల దాడులు జరుగకుండా కాపాడుకోవడం.
పై విషయాలు సాధించడానికి టీఆర్ఎస్ నాయకత్వం ఫాసిస్టు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడకుండా కేంద్రంతో కుమ్ముక్కు కావడం జరిగింది.

బీజేపీ కుమ్ముక్కు లో ప్రయోజనాలు:
1) వివిధ ప్రతిపక్షాలు ఫ్రంట్ గా ఏర్పడకుండా చూడటంలో భాగంగా టీఆర్ఎస్ ను వ్యతిరేక క్యాంపులోకి పోకుండా తన క్యాంపులో వుంచుకోవడం.

2) దేశవ్యాప్త రైతు ఆందోళనలో టీఆర్ఎస్ భాగం కాకుండా వుంచడం.

3) ఇరువురు అధికార పార్టీలుగా వుండి ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతున్న స్థితిలో కాంగ్రెస్ ను దెబ్బతీయడం ద్వారానే తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.

4) జమిలి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరం కావడం.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాలు అవగాహన ఫలితమే నేడు యూటర్న్ రాజకీయాలు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిక్కుతోచని స్థితిలో వున్నది. అయితే కేంద్రం సర్ది చెప్పిన దానిలో భాగమే గందరగోళ ప్రకటనలు. టీఆర్ఎస్ కేడర్ లో మరింత గందర గోళంగా వుంది.

Comments are closed.

Exit mobile version