ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు పోటా పోటీ బల ప్రదర్శన చేసిన ఘటన అధికార పార్టీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ఒకే ఊరు వేదికగా జరుగుతున్న ఓ కార్యక్రమం సందర్భంగా వేర్వేరుగా భారీ బల ప్రదర్శనకు దిగడం విశేషం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెడితే…

పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుల ర్యాలీ దృశ్యం

సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత పొంగులేటి వర్గీయులు గ్రామంలో ఎడ్ల బరువు లాగుడు పందేలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వర్గీయులు మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించారు.

ఒకే ఊరిలో వేర్వేరుగా జరిగిన ఎడ్ల బరువు లాగుడు, మహిళా కబడ్డీ పోటీలు కూడా శనివారం ముగిశాయి. ఆయా పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం కార్యక్రమం కూడా శనివారం నిర్వహించారు. తమ తమ వర్గీయులు వేర్వేరుగా నిర్వహించిన ఆయా పోటీల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు, టీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ నేత డాక్టర్ మట్టా దయానంద్ లు బయలుదేరారు. ఈ సందర్భంగా పొంగులేటి సహా ఆయా నాయకులకు స్వాగతం చెప్పేందుకు టీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు వందలాది కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

సండ్ర వెంకట వీరయ్య వర్గీయుల ర్యాలీ దృశ్యం

ఇదే సందర్భంగా మహిళా కబడ్డీ పోటీలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఆహ్వానించారు. ఈ ఇద్దరు నాయకులను ఎమ్మెల్యే వర్గీయులు కూడా వందలాది కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించి స్వాగతించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన ర్యాలీల్లో కార్లు, బైకుల సందడితో కందుకూరు గ్రామంలో సందడి నెలకొంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మువ్వా యువసేన స్వాగత ఫ్లెక్సీ

విశేషమేమిటంటే ఈ రెండు పోటా పోటీ కార్యక్రమాలకు, పొంగులేటి, సండ్ర వర్గీయుల పార్టీ కేడర్ బలప్రదర్శనకు కందుకూరు వేదికగా నిలవడం. సుమారు కిలోమీటర్ దూరం వ్యత్యాసంలో అటు ఎడ్ల బరువు లాగుడు, ఇటు మహిళా కబడ్డీ పోటీల ముగింపు వేదికలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. మొత్తంగా కందుకూరులో పొంగులేటి, సండ్ర వర్గీయుల బల ప్రదర్శనలో వాహనాల సంఖ్యనేకాదు, కార్యకర్తల అంకెను బేరీజు వేస్తూ ప్రభుత్వ నిఘా వర్గాలు బిజీ బిజీగా ఉండడం కొసమెరుపు.

Comments are closed.

Exit mobile version