మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ఏమంటున్నారు? ఒకింత వేదాంతాన్ని ప్రవచిస్తూనే… మరింతగా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. చక్రవడ్డీ సహా కక్ష సాధింపు బాకీ తీర్చుకుంటామని ఇంకోవైపు హెచ్చరిస్తున్నారు. తన బర్త్ డే ఫ్లెక్సీలను నిర్దాక్షిణ్యంగా తొలగించినా, స్పందించని పొంగులేటి తాజాగా చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి నిన్న సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనలో చేసిన ఆసక్తికర చర్చకు దారి తీయడమే అసలు విశేషం.
ఇంతకీ పొంగులేటి ఏమంటున్నారంటే.., ప్రేమ, అభిమానం ప్రజల్లో తమకుందంటున్నారు. ప్రజాభిమానమే పెద్ద పదవి అంటున్నారు. పదవి రావాలనుకున్నపుడు, ఆ భగవంతుడు ఇవ్వాలనుకున్నపుడు ఎవరు అడ్డుపడ్డా ఆ పదవి ఆగదంటున్నారు. అలాగే పదవి పోయేటపుడు కూడా ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టుకున్నా పోతుందంటున్నారు. పురాణాల్లో ఓ సామెత ఉందని ప్రస్తవిస్తూ.., ఏడేడు లోకాల అవతల ఉన్నా కూడా ఆ చావు అనేది వచ్చినపుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ మృత్యువు వాన్ని వరిస్తుందంటున్నారు. అదేరకంగా ‘పోయే’ టైం వచ్చినపుడు ఎవరు అడ్డుపడ్డా అది ఆగదంటున్నారు. ఇవన్నీ చెబుతూనే ‘ఇది వేదాంతం’ కాదు అంటున్నారు.
పదవులు ఎవడబ్బ సొత్తు కాదని పునరుద్ఘాటించారు. ప్రజాభిమానమే మన అబ్బ సొత్తుగా నిర్వచించారు. తన కార్యక్రమాలకు వచ్చేవారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇటువంటి నాయకున్ని అభ్యర్థిస్తున్నానని, చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని పొంగులేటి మరీ మరీ అభ్యర్థించారు. ‘ఇలాగే చేస్తూ ఉంటే అది సంస్కారం కాదు… నష్టపోయినవారిని ఎలా కాపాడుకోవాలో తెలియనంత అసమర్థుడూ కాదు మేం’ అని పొంగులేటి భరోసా ఇస్తున్నారు. కష్టపెట్టినవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ కష్టపెట్టినవాడు ఆ ప్రతిఫలాన్ని అతడే అనుభవించాల్సి ఉంటుందని, తప్పకుండా వడ్డీతో సహా అనుభవించాల్సి ఉంటుందంటున్నారు. వడ్డీ కాదు.., చక్రవడ్డీతో అనుభవిస్తాడు’ అని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఓ వైపు వేదాంత వ్యాఖ్యలు, మరో వైపు చేతులు జోడించిన అభ్యర్థన తీరు, ఇంకోవైపు హెచ్చరిక… ఇదీ నిన్నటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యల సారాంశం. ఆయన ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో పూర్తిగా చూడవచ్చు.