‘ఆయన ఓ మాజీ ప్రజా ప్రతినిధి, ఎలాంటి అధికార పదవీ లేదు. అయినా ఓ మంత్రి స్థాయిలో పోలీస్ కాన్వాయ్ సేవను పొందుతున్నారు. ఇంతకీ ఏ హోదాలో ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారు? ఎలాంటి హోదా లేని ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? పోలీసు శాఖలోని ఆయన సామాజిక వర్గం నేతలు కాపు కాస్తున్నారా?’ ఇదీ ఓ న్యూస్ ఛానల్ లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ప్రసారమైన వార్తా కథనపు సారాంశం.
ఈ వార్తా కథనాన్ని కనులారా వీక్షించాక ‘పొంగులేటి’కి రక్షణ విషయంలో ఏవో అదృశ్య శక్తులు, లేదా వ్యక్తులు అతనిపై ఈర్ష్యా, ద్వేషాలను ఓ రేంజ్ లో పెంచుకున్నాయనే భావన స్ఫురించక మానదు. సరే ఏ మీడియా శైలి ఆ మీడియాది. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేకపోవచ్చు. ‘ప్లాంటెడ్’ స్టోరీనా? ప్లాన్డ్ స్టోరీనా? అని అనుమానించాల్సిన అవసరమూ లేకపోవచ్చు. ‘కలర్’ ఫుల్ మీడియా గురించి ఇప్పటికే రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉండనే ఉన్నాయి. అంత మాత్రాన సదరు టీవీ ఛానల్ వార్తా కథనాన్ని వ్యతిరేకించే ఉద్దేశపు కథనం కాదిది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఔను.. పొంగులేటికి పోలీస్ సెక్యూరిటీ ఎందుకు పెరిగిందన్నదే అసలు ప్రశ్న కదా? ఎంపీగా ఉన్న కాలంలోనూ ఆయన ఇంటి వద్ద ‘పోలీస్ గార్డ్’ సెక్యూరిటీ లేదు. కానీ మాజీ అయ్యాక మాత్రం పొంగులేటి నివాసం వద్ద ఆర్ముడ్ రిజర్వు విభాగపు పోలీసులతో ‘గార్డ్’ సెక్యూరిటీని ఏర్పాటు చేశారనే కథనాలు వాడుకలో ఉన్నాయి. ఆయన కారు వెనకాల ‘ఎస్కార్ట్’ సెక్యూరిటీ వాహనం కూడా ఫాలో అవుతున్నదట. కానీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న హయాంలోనూ లభించని అదనపు రక్షణ ఇప్పుడే ఆయనకు ఎందుకిచ్చారన్నది కదా అసలు సందేహం?
విశ్వసనీయ సమాచారం ప్రకారం… పొంగులేటికి సెక్యూరిటీ పెంపుదల వెనుక అధికార పార్టీ అగ్ర నేతల భారీ వ్యూహం ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిదింట టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఇందులో మెజారిటీ సీట్లలో అధికార పార్టీ అభ్యర్థుల ఓటమికి పొంగులేటి కారణమనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వైరాలో మదన్ లాల్ ఓటమి తమ లక్ష్యమని పొంగులేటి వర్గీయులు బాహాటంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తమ ఓటమికి పొంగులేటి కారణమంటూ పలువురు అభ్యర్థులు-కమ్-సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫలితాల అనంతరం కేసీఆర్ వద్ద భోరుమన్నారు. ఫిర్యాదుల సారాంశం మొత్తం విన్నాక ‘ ప్రస్తుతం పొంగులేటి ప్రభావం ఖమ్మం జిల్లాకే పరిమితమైంది. ఆయన మరో నాలుగు జిల్లాలపై దృష్టి సారించి ఉంటే నా సీఎం సీటుకే ఎసరొచ్చేది కదనయా..?’ అని సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ఫలితాల నేపథ్యంలో వ్యాఖ్యానించినట్లు ఓ ప్రచారం ఉంది.
అనంతర పరిణామాల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి టికెట్ నిరాకరించి, టీడీపీకి చెందిన నామా నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించి, టికెట్ ఇచ్చి, గెలిపించుకున్న పూర్వాపరాల గురించి కొత్తగా ప్రస్తావించాల్సింది ఏమీ లేదు. ఇదిగో టికెట్ నిరాకరించిన సమయంలోనే..అంటే నిరుడు మార్చి నెల నుంచే ఎంపీ పొంగులేటికి ‘ఎస్కార్ట్’ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పొంగులేటి కారు వెంట ఎస్కార్ట్ పోలీస్ వాహనం ఫాలో కావడం కూడా ఇందులో భాగమే. సాంకేతికంగా పొంగులేటి సెక్యూరిటీ అంశంలో ఎక్కడా తప్పు పట్టే అవకాశం కూడా లేదట. వాస్తవానికి ఏ నాయకుడు కోరకుండా, ఇంటలిజెన్స్ విభాగపు బాస్ అనుమతి లేకుండా సెక్యూరిటీ కల్పన సాధ్యం కాదు కూడా. పొంగులేటి సెక్యూరిటీని అడిగే ఉండవచ్చు.. ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు.
కానీ ఎంపీగా ‘మాజీ’ అయ్యాకే పొంగులేటికి పోలీసు రక్షణ పెంచడం వెనుక అసలు ‘సంగతి’ వేరే ఉందట. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్ నిరాకరణకు గురైన పొంగులేటి కోసం ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. కారణాలు ఏవైనప్పటికీ పొంగులేటి ఏ పార్టీ వైపునకూ మొగ్గు చూపలేదు. కానీ ‘పొంగులేటి’ కదలికలపై అధికార పార్టీ బాస్ కు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయట. పొంగులేటిని ఎవరెవరు కలుస్తున్నారు? ఆయన ఇంటికి వచ్చీ, పోయే వారెవరు? అధికార పార్టికి చెందిన రాష్ట్రంలోని ఏయే మంత్రులు, ఎమ్మెల్యేలు పొంగులేటిని రాసుకు పూసుకు తిరుగుతున్నారు? ఎవరెవరు పొంగులేటి నివాసంలో ఎక్కవ సేపు మంతనాలు జరుపుతున్నారు? వంటి అనేక అంశాలపై నిఘా కోసం కూడా ఇంటలిజెన్స్ అధికారులు సెక్యూరిటీని ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఉన్నతాధికుల నుంచి తమకు అందిన ఆదేశాల ప్రకారం వీఐపీల వెంట రక్షణగా ఉండే పోలీసులు అవసరమైన సందర్బాల్లో ‘ఇంటలిజెన్స్’ విధులను కూడా నిర్వర్తిస్తుంటారనేది కొత్త విషయమేమీ కాదు. టిక్కెట్ దక్కని అవమాన భారాన్ని లోలోపలే అణచుకుంటున్న పొంగులేటి అవసరమైన సందర్బాల్లో తనదైన శైలిలో రాజకీయ పావులు కదుపుతారనే అనుమానం అధికార పార్టీ నేతలకు ఉందనే వాదన వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అధికార పార్టీ ఇప్పటికీ ఆషామాషీగా భావించడం లేదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అదీ అసలు సంగతి.