మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పై యుద్ధం చేయడంలో బీజేపీ వ్యూహమేంటో చూడాలన్నారు. కేసీఆర్ పై కేసులు మొదలవుతాయని చెప్పారని, అంత తొందర ఎందుకని ప్రస్తుతం అంటున్నారని కొండా పేర్కొన్నారు. తాను పార్టీ ఏర్పాటు చేయకుంటే, కేసీఆర్ పై బీజేపీ గట్టి యుద్ధం చేస్తే ఆ పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి రెండేళ్లు పడుతుందా? అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మారితే, కాంగ్రెస్ గట్టి ఫైట్ చేస్తే అదే పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు.
ప్రజల కోసం కొట్లాడడం తనకిష్టమని, అందుకే తీన్మార్ మల్లన్నతో కూడా కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. వైఎస్ షర్మిల పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తన డైరీలో ఆ పార్టీకి అవకాశమే లేదన్నారు. షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదని, ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. తనను షర్మిల పార్టీలోకి ఆహ్వానించారని, కానీ తాను వెళ్లదల్చుకోలేదన్నారు. షర్మిలకు జగన్ తో విభేదాలు ఉన్నట్లు తాను భావించడం లేదన్నారు. జగన్ తో ‘ఒప్పందం’ మేరకే నేనిక్కడ, నువ్వక్కడ అనే పద్థతిలో షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.