ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో తెలంగాణా సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత భారీ మెజారిటీతో గెలుస్తారని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే నెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో అభ్యర్థి కవిత, జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మండలి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కవిత ఎమ్మెల్యేలను కోరారు. గెలిచే అవకాశం లేనప్పటికీ ప్రతిపక్షాలు పోటీ చేస్తున్నాయని, వారికి భంగపాటు తప్పదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.