ముందు ఇక్కడ గల వీడియోను చూస్తూ, అందులోని ‘చాటింపు’ వ్యాఖ్యలను శ్రద్ధగా వినండి. అర్థమైంది కదా? ఓ మాజీ ఎమ్మెల్యే గూండాగిరి ద్వారా అక్రమ సంపాదనను ప్రభుత్వం జప్తు చేసినప్పటి దృశ్యమిది. వాస్తవానికి ఈనెల 11వ తేదీన జరిగిన ఘటన ఇది. తెలుగు మీడియాలో పెద్దగా ఫోకస్ కాని వార్త. కానీ జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో తమ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన చేతల ద్వారా చూపిస్తున్నారని బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా జరిగి తీరాలని కూడా బీజేపీ శ్రేణులు అభిలషిస్తున్నాయి. సరే, వారి అభిలాష నెరవేరుతుందా? లేదా? అనే అంశాలను కాసేపు పక్కనబెడితే అసలేం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం.
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో ఉట్రౌలా అనే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇక్కడి నుంచి ఆరిఫ్ అన్వర్ హష్మీ అనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరిఫ్ అన్వర్ హష్మీ వివిధ కేసులకు సంబంధించి జైలులో ఉన్నారు. ఆయనకు చెందిన సుమారు రూ. 50 కోట్ల విలువైన ఆస్తులను అక్కడి జిల్లా అధికార యంత్రాంగం ఈనెల 11వ తేదీన జప్తు చేసింది. గ్యాంగ్ స్టర్ చట్టం కింద జప్తు చేసిన ఆరిఫ్ కు చెందిన ఆస్తుల్లో ఎటి హష్మీ డిగ్రీ కళాశాల, నేషనల్ మోడ్రన్ ఇంటర్ కాలేజీ, ఏజి హష్మి ఇంటర్ కాలేజిలను నిర్వహిస్తున్న స్థిరాస్తులతో పాటు చరాస్తులుగా పరిగణించే రూ. 65 లక్షల విలువైన నాలుగు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ గ్యాంగ్ స్టర్ చట్టం ప్రకారం జప్తు చేసినట్లు బలరాంపూర్ జిల్లా ఎస్పీ హేమంత్ కుటియా ప్రకటించారు.
ఇంతకీ ఈ మాజీ ఎమ్మెల్యే ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయడానికి గల అసలు కారణం ఏమిటంటే… హష్మీపై భూకబ్జా సహా ఇరవై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఓ ఏడాదిపాటు అతని నేర చరిత్రను తవ్వి అతనిపై గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా హష్మీ సంపాదించిన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గ్యాంగ్ స్టర్ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఓ జిల్లా మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్ ఆరోపణలు గల వ్యక్తిపై విచారణ జరిపి, ఆధారాలు లభించిన నేరాల ప్రకారం కమిషన్ ఏర్పాటు చేసి గూండాగిరి ద్వారా సంపాదించిన అస్తులను జప్తు చేయవచ్చని ఆదేశించే అధికారాన్ని కలిగి ఉంటారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి పొలిటికల్ లీడర్ అయినా, మరెవరైనా సరే… గూండాగిరి ద్వారా ఆస్తులను సంపాదించినట్లు నమ్మడానికి కారణాలు ఉంటే అతని ఆస్తులను జప్తు చేయాలని యూపీ సర్కార్ చట్టం నిర్దేశిస్తోంది. దీని ప్రకారం నేరస్థుని స్థిర, చరాస్తుల జప్తునకు ఆదేశించవచ్చు. మాజీ ఎమ్మెల్యే ఆరిఫ్ అన్వర్ హష్మీ ఆస్తులను ఇదే కారణంపై యోగి సర్కార్ జప్తు చేసింది.