ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో ఇది సంచలన పరిణామం. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్ది సేపటి క్రితం ఖమ్మం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీరిపై చర్యలు తీసుకోవాలని తుమ్మల తన ఫిర్యాదులో పోలీసు శాఖను కోరారు. సోషల్ మీడియాలో చేసే తనపై చేసే దుష్ప్రచారపు పోస్టులపై తుమ్మల ఫిర్యాదు చేయడం ఇది రెండోసారి కూడా. అయితే ఈసారి ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అయిదుగురు వ్యక్తులు ఎవరనే అంశంపైనే భిన్న ప్రచారం సాగుతోంది.
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఐదుగురు వ్యక్తుల పేర్లను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదులో ఉటంకించారు. వారి ఫోన్ నెంబర్లను కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఐదుగురు వ్యక్తుల్లో షేక్ ముక్తార్ అనే వ్యక్తి స్తంభాద్రి డెవలప్మెంట్ అథారిటీ (సుడా) డైరెక్టర్ గా తుమ్మల వర్గీయులు ప్రస్తావిస్తున్నారు. మడూరి సైదారావు అనే వ్యక్తి నగరంలోని ఓ దేవాలయ కమిటీకి ఇటీవలి వరకు చైర్మెన్ గా పని చేశారని కూడా చెబుతున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న మరో ముగ్గురు వ్యక్తులు సహా ఫిర్యాదులో ప్రస్తావించిన ఐదుగురు సైతం మంత్రి అజయ్ వర్గీయులుగానే తుమ్మల అనుయాయులు పేర్కొంటున్నారు.
ఇదే గనుక నిజమైతే తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదు మంత్రి అజయ్ వర్గీయులపైనే… అని భావించాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా తన ఫిర్యాదు సందర్భంగా పోలీసులకు తుమ్మల జతపర్చిన ఆధారాల్లో ‘పువ్వాడ యూత్’ పేరున గల సోషల్ మీడియా గ్రూపులు కూడా ఉండడం గమనార్హం. పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యనేతల పేర్లు కూడా ఉండడం మరో ముఖ్యాంశం. ఈ పరిణామాల్లో ఖమ్మం అధికార పార్టీ రాజకీయాలు మరోసారి సంచలనానికి దారి తీసినట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తుమ్మల పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతిని దిగువన చూసేయండి.