ఔను… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ కు పయనమవుతున్నారు. ఆయన హైదరాబాద్ కు వెళ్లడం కొత్త కాకపోవచ్చు. కానీ… తనను కలవాల్సిందిగా సీఎం కేసీఆర్ నుంచి తమ నాయకుడికి ఫోన్ కాల్ వచ్చిందనే విషయాన్ని తుమ్మల అనుచరగణం ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుమ్మల హైదరాబాద్ కు పయనమవుతున్న అంశం సహజంగానే రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పరిణామాల్లో గత మార్చి నుంచి ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ లో గల తన నివాసానికి సైతం ఒకే ఒక్కసారి మాత్రమే వెళ్లినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. లాక్ డౌన్ విధించిన మార్చి నెలలో రాజధానికి వెళ్లి నాలుగు రోజులపాటు ఉండి వచ్చారంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తుమ్మల మళ్లీ హైదరాబాద్ వైపు వెళ్లలేదని చెబుతున్నారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన నివాసంలోనే ఉంటూ వ్యవసాయ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లోనే తుమ్మలకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందనే అంశం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం. తన రాజకీయ ఎదుగుదలకు సంబంధించి ఆది నుంచీ ‘ముహూర్త’ బలాన్ని గట్టిగా విశ్వసించే తుమ్మల నాలుగు రోజులు ఆగి కలుస్తానని సీఎం కేసీఆర్ ను కోరినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే ఈనెల 3వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ కు పయనమవుతున్నట్లు కూడా ఆయన అభిమానులు వెల్లడించారు.
‘సోమవారం… శ్రావణ పౌర్ణమి’ రోజున తుమ్మల హైదరాబాద్ కు వెడుతుండడాన్ని ఆయన అనుచరగణం ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. ఈనెల 5వ తేదీన సీఎం కేసీఆర్ ను తుమ్మల నాగేశ్వరరావు కలుస్తారని కూడా గట్టిగా చెబుతున్నారు. అయితే తుమ్మల వంటి సీనియర్ నాయకుడి వల్ల పార్టీకి భవిష్యత్తులో ఒనగూరే ప్రయోజనాలపై సహజంగానే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు సమీపిస్తున్న ఎన్నికలు, తదితర అంశాలపై రకరకాల రాజకీయ అంచనాలు, విశ్లేషణలు కూడా సాగుతుండడం విశేషం. తుమ్మల రాజకీయ భవితపై ఆయన అనుచరగణం అంచనాల ఫలితం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే.