దాదాపు రెండు దశాబ్ధాల క్రితం ఖమ్మం కలెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎ. గిరిధర్ ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గురువారం ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ముడిపడి ఉన్న పలు రోడ్ల సమస్యలపై గిరిధర్ తో తుమ్మల నాగేశ్వర్ రావు చర్చించారు.
ముఖ్యంగా నాగపూర్ నుండి అమరావతి వరకు నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే ఎలైన్ మెంట్ ను ఆ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఖమ్మంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ అవతల పక్కనుండివెళ్లే విధంగా మార్పు చేయాలని కోరారు.
అదేవిధంగా ఖమ్మం నుండి దేవరాపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రహదారి భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం మొత్తాలను వెంటనే చెల్లించి రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు.
భద్రాచలం నుండి ఏటూరునాగారం మీదుగా కాళేశ్వరం వరకు జాతీయ రహదారి మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించనందున తీవ్రవాద ప్రాబల్య ప్రాంత నిధులతో రెండు లైన్ల రోడ్డుగా మంజూరు చేసి పనులు ప్రారంభించాలని, ఆ తర్వాత నాలుగు లైన్ల రహదారిగా మార్పు చేయాలని కోరారు.
అంతేగాక భద్రాచలం నుండి కుక్కునూరు మీదుగా కొవ్వూరు వరకు జాతీయ రహదారి మంజూరైందని, కానీ కుక్కునూరు పోలవరం ప్రాజెక్ట్ ముంపునకు గురువుతున్నందున, ఆయా అలైన్ మెంట్ ను దమ్మపేట, అశ్వారావుపేట మీదుగా మార్చాలని కోరారు.
అదేవిధంగా భద్రాచలం నుండి వయా కొత్తగూడెం, ఇల్లెందు, మహబూబాద్ మీదుగా భువనగిరి వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా మార్పు చేసినందున పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవేగాక పెండింగ్ లో ఉన్న రహదారుల సమస్యలపై చర్చించినట్లు, అన్నింటిపైనా కేంద్ర ఉపరితల రవాణా కార్యదర్శి గిరిధర్ సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తుమ్మల నాగేశ్వర్ రావు ప్రచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.