ఆయన శాసించారు. అధికార గణం పాటించింది. ఒకటీ, రెండేళ్లు కాదు. దాదాపు మూడున్నర దశాబ్ధాలపాటు జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపించారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. చంద్రబాబు వద్ద నెంబర్ టూ గా ప్రాచుర్యం పొందారు. ఓ దశలో రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక వ్యక్తిగా నిలిచారు. జలగం వెంగళరావు కుటుంబాన్ని రాజకీయంగా ఎదిరించిన నేపథ్యం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా పార్టీ మారక తప్పని అనివార్య స్థితి. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా కేసీఆర్ తొలి ప్రభుత్వంలో నేరుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ చతురత. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందిన కొందరు మంత్రుల్లో ఆయన కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఆయన ఏరోజూ పోలీసులను ఆశ్రయించలేదు. అనేక అంశాల్లో కొందరు పోలీసు అధికారులే ఆయన కనుసైగకు ‘ఎస్.. సర్’ అన్న ఉదంతాలు చాలా ఉన్నాయి. అటువంటి కాకలు తీరిన రాజకీయ నేత మొట్ట మొదటిసారి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
ఈపాటికి విషయం అర్థమై ఉంటుంది కదా? సబ్జెక్టు ఏమిటో? సదరు నాయకుడెవరో? ఔను ఆయనే తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం మాజీ మంత్రి. ఖమ్మం జిల్లా రాజకీయాలను తన కనుసైగ ద్వారా దశాబ్ధాల తరబడి శాసించిన తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల తీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేయడం కూడా తొలిసారే. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల మాజీ సర్పంచ్ బండి జగదీష్ పై కేసు నమోదుకు సంబంధించి తుమ్మల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. సరే అది వేరే విషయం.
కానీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలో తొలిసారి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఆడియో గురించి తుమ్మల పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని అభ్యర్థించడం గమనార్హం. తన సంతకంతో పోలీసులకు తుమ్మల ఫిర్యాదు చేసిన ఉదంతం కూడా ఇదే మొదటిది కావడం విశేషం. వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు నుంచి అనూహ్యంగా ఓటమి చెందిన తుమ్మల తాజా రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా కూడా లేరు. కానీ ఆయన గొంతును పోలిన స్వరంతో ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. యూ ట్యూబ్ లోనూ వైరల్ గా మారింది. అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను తుమ్మలకు ఆపాదిస్తూ ఎవరో సోషల్ మీడియలో అప్ లోడ్ చేశారు. ఈ విషయంపైనే తుమ్మల మంగళవారం ఖమ్మం పోలీసులను ఆశ్రయించారు.
ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాకపోయినా, తన వాయిస్ గా చిత్రీకరించి, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపైనేగాక, వారి వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులపై విచారణ జరిపి, ఐటీ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవలసిందిగా తుమ్మల ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ను అభ్యర్థించారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, వైరల్ గా మారిన తప్పుడు ప్రచారాన్ని నివారించాలని తుమ్మల కోరారు. ఈ మేరకు తుమ్మల సంతకంతో కూడిన దరఖాస్తును అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు సాధు రమేష్ రెడ్డి, రామసహాయం నరేష్ రెడ్డి, ఆరెంపుల మాజీ సర్పంచ్ బండి జగదీష్ తదితరులు ఖమ్మం పోలీస్ కమిషనర్ కు అందించారు. తన మూడున్నర దశాబ్ధాల రాజకీయ జీవితంలో తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల తీరుపై విమర్శలు చేసిన ఉదంతం బండి జగదీష్ పై కేసు ఘటన కాగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియోను ఉటంకిస్తూ, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడం కూడా మొదటిసారే. తన రాజకీయ జీవితంలో మరే అంశంలోనూ పోలీసులను విమర్శించిన, ఆశ్రయించిన దాఖలాలు లేవు. అదీ సంగతి.