టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి ఒకరు డుమ్మా కొట్టిన ఘటన అధికార పార్టీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో అత్యంత అట్టహాసంగా జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గైర్హాజరైన ఉదంతం ఆ జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఎమ్మెల్యే బీరంతో జూపల్లికి ఏర్పడిన రాజకీయ విభేదాలు ప్లీనరీ గైర్హాజరుకు దారి తీసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలు తదితరులకు ప్లీనరీకి అధికారికంగా ఆహ్వానం ఉన్నప్పటికీ, జూపల్లి ప్లీనరీవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

కొల్లాపూర్ నియోజకవర్గంలో నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనేది జూపల్లి వర్గీయుల ఆరోపణ. ముఖ్యంగా తమ వర్గీయులపై కేసులు బనాయిస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నారని జూపల్లి వాపోతున్నారు. ఇదే సందర్భంగా జూపల్లి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.

తన కార్యకర్తలపై, నాయకులపై రాయలసీమ రౌడీలతో, పోలీసుతో దాడులు చేయిస్తున్నారని జూపల్లి ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన నాయకులపై పోలీసులతో దాడుల ఏమిటని ప్రశ్నించారు. విషయాన్ని మంత్రికి చెప్పినా, పోలీసు ఉన్నత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆయా పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనోవ్యధతోనే తాను ప్లీనరీకి హాజరు కాలేదని మాజీ మంత్రి జూపల్లి వెల్లడించారు.

Comments are closed.

Exit mobile version