రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయనే నానుడి కొత్తదేమీ కాదు. కాకపోతే అది అనుభవంలోకి వచ్చాకే అసలు కష్టాలు ఎదురవుతుంటాయి. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుందన్నది అనుభవజ్ఞుల భాష్యం.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విషయంలో తాజా రాజకీయ పరిణామాలను ఇందుకు అన్వయిస్తున్నారు పరిశీలకులు. మున్సిపల్ ఎన్నికల పోరులో జూపల్లి వర్గానికి చెందిన తిరుగుబాటు కౌన్సిలర్లను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానం నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొల్లాపూర్ మున్సిపాల్టీలో 20 వార్డులకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచించి తొమ్మిది స్థానాలు మాత్రమే. మున్సిపల్ చైర్మెన్ పీఠాన్ని అధిష్టించడానికి మేజిక్ ఫిగర్ 12 వరకు సభ్యుల బలం ఉండాలి.
ఇదే దశలో మాజీ మంత్రి జూపల్లి వర్గానికి చెందిన 11 మంది ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థుల రూపంలో రెబల్స్ గా విజయం సాధించినా, తాము టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తామని ప్రకటించినా అధిష్టానం అంగీకరించడం లేదట. ఈ విషయంలో మాట్లాడేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన జూపల్లికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట. ఎందుకంటే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల బలంతో ఎలాగూ చైర్మెన్ పీఠం టీఆర్ఎస్ పార్టీకే దక్కుతున్నదట. అందుకే జూపల్లి వర్గానికి టీఆర్ఎస్ అధిష్టానం ఝలక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణా కోసం మంత్రి పదవిని త్యజించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన జూపల్లి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. కానీ తాము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనని జూపల్లి శనివారం ప్రకటించడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఓడిపోయిన కొందరు మంత్రుల్లో జూపల్లి కూడా ఒకరు.. గుర్తుంది కదా? జూపల్లి వర్గం తనను ఇబ్బంది పెడుతున్నదని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు జైకొట్టిన స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి సంయుక్తంగా కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.