తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖరారైనట్లుగానే భావిస్తున్నారు. నిన్న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఈటెల సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కూడా అయ్యారు. తెలంగాణా బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సరిగ్గా నెలరోజుల క్రితం కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ రాజకీయ భవితవ్యంపై భిన్న ప్రచారాలు సాగాయి. వివిధ కోణాల్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈటెలను తమ పార్టీల్లోకి లాగేందుకు ప్రయత్నించినట్లు వార్తా కథనాల సారాంశం. ఇదే దశలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కూడా ఈటెలతో భేటీ అయ్యారు. బీజేపీ వైపు చూడవద్దని, ఐక్యవేదిక నిర్మిద్దామని చర్చించినట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఇంకోవైపు ఈటెల రాజేందర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని ఆయన అనుయాయులు, అభిమానులు అంచనా వేశారు. ఆయా పరిణామాల నేపథ్యంలోనే నెలరోజుల ఊగిసలాట మధ్య చివరికి బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతూ ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్లినట్లు తాజా వార్తల సారాంశం.

ఇంతకీ తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ ఈటెల రాజేందర్ కు కల్పించే ప్రాధాన్యత ఏమిటి? ఆయనకు ఏదేని ముఖ్య పదవిని ఇస్తారా? ప్రచారంలో గల కథనాల ప్రకారం ఈటెలను రాజ్యసభకు పంపి కేంద్ర సహాయ మంత్రి పదవిని ఇస్తారా? అసలు ఈటెల రాజేందర్ వల్ల బీజేపీకి లభించే రాజకీయ ప్రయోజనమేంటి? బీజేపీలో చేరడం వల్ల ఈటెలకు దక్కే ఫాయిదా ఏంటి? ఇవీ తాజా సందేహాలు. ఆయా ప్రశ్నలకు జవాబులు లభించాలంటే గతంలో వేర్వేరు కారణాల వల్ల బీజేపీలో చేరిన పలువురు నేతలను ఉదాహరణగా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కాకపోయినా, తెలంగాణాలో భిన్న రాజకీయ పరిణామాల మధ్య బీజేపీలో చేరిన కొందరు నేతల ప్రస్తుత స్థితిని ఉటంకించాల్సిన అవసరముందనే వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.

గరికపాటి రామ్మోహన్ రావు…. పేరు గుర్తుంది కదా? తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ప్రముఖంగా వెలుగు వెలిగిన నేత. రాజ్యసభ సభ్యునిగానూ టీడీపీ ఆయనకు గుర్తింపునిచ్చింది. వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలో చిన్నపాటి కాంట్రాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన గరికపాటి మోహన్ రావు రాష్ట్రంలోనే బడా కాంట్రాక్టర్ గా, బిజినెస్ మేన్ గా ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ‘కుడి భుజం’గానూ వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాల్లో గరికపాటి రామ్మోహన్ రావు కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గరికపాటి రామ్మోహన్ రావుకు బీజేపీలో చేరడం వల్ల ఒనగూరిన ప్రయోజనమేంటి? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్లు దక్కని నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో జితేందర్ రెడ్డి కూడా ఒకరు. ఆయనకు కూడా ఇప్పటి వరకు బీజేపీలో దక్కిన ప్రాధాన్యత ఏమిటనే అంశంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి.

ఇకపోతే పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఓ మీడియా సంస్థ అధిపతిగానూ వ్యవహరిస్తున్న వివేక్ కేసీఆర్ వ్యవహార తీరుపై విమర్శలు చేసి మరీ కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ వివేక్ కు కూడా బీజేపీలో చేరాక ఒనగూరిన భారీ ప్రయోజనమేమిటనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధమైనట్లుగానే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈటెల రాజేందర్ వల్ల బీజేపీకి, బీజేపీ వల్ల ఈటెల రాజేందర్ కు లభించే పరస్పర ప్రయోజనాలపైనా చర్చ జరుగుతోంది. గరికపాటి రామ్మోహన్ రావు, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలను రాజకీయ పరిశీలకులు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. కాంట్రాక్టర్లుగా, బిజినెస్ మేన్లుగా ప్రాచుర్యం గల ఆయా నాయకుల తరహాలోనే ఈటెల రాజేందర్ కు కూడా బీజేపీలో చేరడం వల్ల కాస్త ‘సెక్యూరిటీ’ లభిస్తుందనే వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం కింద పరిగణించే హేచరీస్, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా వ్యాపారంగానే భావించాల్సి ఉంటుందని, భూకబ్జాల వంటి ఆరోపణలు, కేసీఆర్ సర్కార్ విచారణ పర్వపు ఘటనలు పూర్వ జీవితంలో ‘కామ్రేడ్’గా పేరుగాంచిన ఈటెల రాజేందర్ ను కాషాయ కండువా కప్పుకునేందుకు దారి చూపించి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వ్యాపార లక్షణాలు పుష్కలంగా గల నాయకుల వల్ల కూడా బీజేపీ బలోపేతమవుతుందనే వాదన ఆ పార్టీ వర్గీయుల నుంచే వినిపిస్తుండడం అసలు విశేషం.

Comments are closed.

Exit mobile version