బీజేపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భారీ కసరత్తు చేసినట్లు సమాచారం. ఇందుకోసం తెలంగాణాలోని పలు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈటెల వెంట సోమవారం ఢిల్లీకి వెడుతుండడం విశేషం. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మెన్ తుల ఉమ వంటి నాయకులేగాక వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది నాయకులను ఈటెల తన వెంట ఢిల్లీకి తీసుకువెడుతున్నారు. ఇందుకోసం సోమవారం ఉదయం ప్రత్యేక విమానాన్ని కూడా బుక్ చేశారు. ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక విమానంలో ఈటెల వెంట ఢిల్లీకి వెళ్లేందుకు తెలంగాణాలోని పలు జిల్లాలకు చెందిన నాయకులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
అయితే ఈటెల వెంట వెడుతున్న వారి వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన కొందరు జిల్లా అధ్యక్షులు కూడా ఈటెలతో ఢిల్లీకి వెడుతున్నట్లు తెలిసింది. ముదిరాజ్ సంఘాల నేతలు, ఉద్యమ ప్రముఖులు కూడా అనేక మంది ఈటెలతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెడుతున్నారు. వాస్తవానికి ఇంకా అనేక మందిని తన వెంట తీసుకువెళ్లడానికి ఈటెల సంసిద్ధం కాగా, కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలోనే తీసుకురావాలని బీజేపీ నాయకత్వం సూచించినట్లు ఆయన అనుచరగణం చెబుతోంది. కాగా ఈటెల వెంట ఏయే జిల్లాల నుంచి ఎవరెవరు వెడుతున్నారనే అంశంపై నిఘా వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.