వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో… అంటే 2023 ఎన్నికల్లో లభించే అధికారంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 తర్వాత నువ్వూ ఉండవ్.., నీ అధికారం ఉండదని, నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నవో… అదే నీకు పునరావృతమవుతుందని, అదే గతి నీకూ పడుతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మాట్లాడుతున్న నాయకులు ఒక్కరోజైనా స్థానిక కేడర్ బాధను పంచుకున్నారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరి గెలుపులోనైనా మీరు సాయం చేశారా? అని నిలదీశారు. తోడేళ్ల మాదిరిగా దాడులు చేస్తున్నారని, మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలని ఈటెల వ్యాఖ్యానించారు.
‘బిడ్డా గుర్తు పెట్టుకో… ఎవడూ వెయ్యేళ్లు బతకడు. అధికారం శాశ్వతం కాదు, హుజూరాబాద్ ప్రజలను వేధిస్తున్నవ్. బిల్లులు రావని ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారు, కరీంనగర్ ను బొందలగడ్డ చేస్తున్నవ్. నువ్వు ఎన్ని టాక్సులు ఎగ్గొట్టినవో తెల్వదనుకుంటున్నవా? టైమ్ వచ్చినపుడు అన్నీ బయటపడతయి. నీ కథ ఏందో అంతా తెలుసు….2023 తర్వాత నువ్వూ ఉండవ్… నీ అధికారం ఉండదు’ అని రాజేందర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో 2006లో ఎంపీగా పోటీ చేసినపుడు కాంగ్రెస్ నాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత మందిని కొన్నా తెలంగాణా ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారని గుర్తు చేశారు.
ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా అదే జరుగుతుందని, ప్రజలు అమాయకులు కాదని, సంస్కారంతో తాను మార్యద పాటిస్తున్నానని, సహనం కోల్పోతే మాడి, మసై పోతారని హెచ్చరించారు. హుజూరాబాద్ లో తన మిత్రుడికి ఇంచార్జి ఇచ్చినట్లు తెలిసిందని, కానీ మొన్నటి ఎంపీ ఎన్నిక్లలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వస్తే, 54 వేల మెజారిటీని ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం హుజూరాబాద్… అని ఈటెల అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని, ఇక్కడి ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తాననని రాజేందర్ హామీ ఇచ్చారు.
ఫొటో: హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న ఈటెల రాజేందర్