తన ఎజెండా ఏమిటో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. శనివారం తన శాసన సభ్యత్వానికి రాజీనామా సమర్పించడానికి ముందు గన్ పార్క్ లోని తెలంగాణా అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, తన ఎజెండా రైట్ ఎజెండా కాదని, లెఫ్ట్ ఎజెండా కాదన్నారు.తెలంగాణాలో యావత్ ప్రజానీకం ఫ్యూడల్, నియంతృత్వ పాలనలో కొనసాగుతోంది కాబట్టి, దాని నుంచి విముక్తి చేయడమే, దానికి ఘోరీ కట్టడమే తన ఎజెండాగా ప్రకటించారు. హుజురాబాద్ లో జరిగే కురుక్షేత్రంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమే గెలుస్తుందని ఈటెల అన్నారు.
చైతన్యం, సంఘాలు, ఐక్యత… తెలంగాణాలో ఉండకూడదన్నదే లక్ష్యమని, తానొక చక్రవర్తిలాగా పరిపాలించుకోవాలె, తన తర్వాత తన కుటుంబ సభ్యులు పరిపాలించుకోవాలనే ఫ్యూడల్ మనస్తత్వం తప్ప… ఇక్కడ ప్రజాస్వామిక వాతావరణం లేదని ఈటెల విమర్శించారు. ఇవ్వాళ కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పార్టీ సహచరులకు అన్ని విషయాలు తెలుసన్నారు. అప్పుడప్పుడు, అక్కడక్కడ తనలాంటివారు గొంతెత్తినప్పుడు కొంత గౌరవం దక్కవచ్చని, కానీ అది శాశ్వతం కాదన్నారు. వాళ్ల అంతరంగలో ఏముందో తమకు తెలుసు కాబట్టి, తెలంగాణా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులకు, చైతన్యవంతులకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
హుజూరాబాద్ లో గెలుపు తనది కాదని, ఇప్పటికే ఆరుసార్లు ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచా, ఏడు సంవత్సరాలపాటు మంత్రిగా కొనసాగిన… ఇంతకంటే గొప్ప పదవి ఏమీ లేదు… కానీ, ఇవ్వాళ డబ్బుకీ, కేసీఆర్ అహంకారానికి, తెలంగాణా ఆత్మగౌరవానికి, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో మీరందరు కూడా హుజూరాబాద్ ప్రజలకు సంఘీభావంగా ఉండాలని తెలంగాణా ప్రజలను అభ్యర్థించారు. రాబోయ కాలంలో మనిషిలో ఉండే కష్టాన్ని చూసే ప్రయత్నం చేస్తానని, కన్నీళ్లు తుడిచే యత్నం చేస్తానని, ఏ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రజానీకం ఆరాటపడుతున్నదో.., ఆ ఆత్మగౌరవ పోరాటంలో తప్పకుండా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానని మీ బిడ్డగా ప్రమాణం చేస్తున్నానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.