ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొంగులేటి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. ఇంటర్వ్యూ పరంపరలో భాగంగా అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ తో తనకు గొడవ లేదనిగాని, ఉందనిగాని అననని పేర్కొన్నారు. ఓ తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే చిన్నచిన్న ‘గ్యాప్’లు రావడం సర్వసాధారణమని, ఇంటి పెద్దగా ఆ తండ్రి సమస్యను పరిష్కరించడం కూడా సర్వసాధారణమన్నారు. తన ఇంటర్వ్యూలో పొంగులేటి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే….
‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నేను బతికినంత కాలం పార్లమెంట్ సభ్యునిగా ఉంటాననో, మంత్రిగా ఉంటాననో, బతికినంతకాలం ఉన్నతమైన స్థానంలో కూర్చుంటానంటే అది పొరపాటు. ప్రజలు మార్పు కోరినపుడు, పార్టీలో పెద్దలు మార్పు చేయాలని అనుకున్నపుడు తప్పకుండా మార్పు జరుగుతుంది. మార్పు జరిగినపుడు నిలదొక్కుకున్నవాడే ప్రజానాయకుడు అని నేను నమ్ముతాను, అదే బాటలో నేను పయనిస్తున్నాను. అధికారం ఎప్పుడూ, ఎవరికీ శాశ్వతం కాదు. అధికార మైకంలో తప్పులు చేస్తే, తప్పునకు శిక్షకు అర్హులు వాళ్లు. అధికారమే ఉందని, అహంకారపూరితంగా నడుచుకుంటే ప్రజలిచ్చే తీర్పునకుగాని, జరిగే పరిణామాలకుగాని వారే బాధ్యులవుతారు. అధికారమనేది అప్ అండ్ డౌన్, ఒక సముద్రంలో అలలాగా… కిందపడ్డ అల తప్పకుండా పైకిలేస్తది. పైనలేచిన అల కిందకు దిగుతది. ఇది నేను వేదాంతం చెప్పడం కాదు, సృష్టిని చూస్తున్నాం, వందల సంవత్సరాలుగా పురాణాల నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఎప్పుడు ఏదీ, ఎవరికీ శాశ్వతం కాదనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. దాన్ని పూర్తిగా నేను నమ్ముతాను.’’ అని పొంగులేటి తన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.