పొంగులేటి శ్రీనివాసరెడ్డి… సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలను అతలాకుతలాం చేసినట్లు ఖ్యాతి గడించిన నేత. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో అనేక మంది టీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలుకావడానికి కారణమనే విమర్శలను, ఆరోపణలను ఎదుర్కున్న నాయకుడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ‘సిట్టింగ్’ ఎంపీగా ఉన్నప్పటికీ పార్టీ టికెట్ దక్కించుకోలేని దైన్యస్థితిని ఎదుర్కున్న చేదు అనుభవం. ఇందుకు కారణాలు ఏవైనప్పటికీ, ప్రస్తుతం పొంగులేటి ఓ మాజీ ఎంపీ మాత్రమే. అయితే ఏంటీ అంటే…?
ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయ్. నిన్నటి వరకు ఉప్పూ-నిప్పుగా ప్రాచుర్యం పొందిన నేతలు పరస్పరం ఆలింగనాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశమా? లేక ఇతర కారణాలా? అనే అంశం స్పష్టంగా తెలియకపోయినా, ఏమాత్రం పొసగని నేతలు ఒక్కటైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లడం, ఈ సందర్భంగా తనను సాదరంగా ఆహ్వానించిన తుమ్మలకు అజయ్ తలవంచి ప్రణమిల్లిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఈ విషయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ‘ట్రబుల్ షూటర్’గా వ్యవహరించినట్లు తెలుస్తున్న ఘటన రాజకీయంగా మరింత ఆసక్తికరం. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ముగ్గురు ముఖ్య నేతలు ఒక్కటయ్యారు. ఈ ఒక్కటైన ‘చిత్రం’ కేవలం ప్రజల ముందు వరకేనా? కడుపులో ఉన్నట్లు కౌగిలించుకున్న చందపు వాస్తవమేనా? అనే సంశయాల సంగతి వేరు.
కానీ మారుతున్న రాజకీయ పరిణామాల్లో తమ నాయకుడి పరిస్థితి ఏమిటి? ఇదీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుయాయులను, అభిమానులను తీవ్రంగా తొలుస్తున్న ప్రశ్న. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా పొంగులేటి కిమ్మనకుండానే ఉన్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, కేసీఆర్ ఆదేశాన్ని పాటిస్తానని అప్పట్లో పొంగులేటి ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొంగులేటి అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ జిల్లాలో పొంగులేటి రాజకీయ పరిస్థితి రోజురోజుకూ డామేజ్ అవుతోందనే ఆందోళన ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే గత నెల 28వ తేదీన పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం నగరంలో ఆయన ‘ఫ్లెక్సీలు’ కూడా కట్టలేని పరిణామాలను చవి చూశారు. అధికార పార్టీ నేతగా కొనసాగుతున్నప్పటికీ, బర్త్ డే ఫ్లెక్సీలను కట్టలేని పరిణామాలు ఏ సంకేతాలను ఇస్తాయనే మీమాంసను పొంగులేటి అభిమానులు ఎదుర్కుంటున్నారు. అంతేగాక శుక్రవారం ఉదయం నాలుగు గంటల వరకు కూడా ఖమ్మంలోనే ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ‘రైతువేదిక’ల ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదా? ఒకవేళ పిలిచినా ఆయన వెళ్లలేదా? అనే ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానం లేదు.
ఇటువంటి రాజకీయ పరిణామాల్లో ‘పొంగులేటి’ భవిష్యత్ రాజకీయ అడుగులు ఎటువైపు? ఇదీ తాజా చర్చ. వాస్తవానికి పొంగులేటి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంపీ కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించి, ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కేసీఆర్ కు ప్రణమిల్లి గులాబీ కండువా కప్పుకుని, గత ఎన్నికల్లో కనీసం టికెట్ దక్కని దుస్థితిని ఎదుర్కున్నారనేది ఆయన అనుయాయుల ఆవేదన. కాంట్రాక్టులు, ఆర్థిక అంశాల వంటి కారణాలు ఏవైనప్పటికీ, పొంగులేటి తదుపరి రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అసలు ఆయన రాజకీయంగా కొనసాగుతారా? లేక బడా కాంట్రాక్టర్ గానే మిగిలిపోతారా? జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం శ్రీనివాసరెడ్డి ఏదేని రాజకీయ పార్టీని స్థాపించే అవకాశాలున్నాయా? లేక కాంగ్రెస్, బీజేపీల్లో ఏదేని పార్టీలో చేరుతారా? అధికార పార్టీలోనే కొనసాగుతారా? ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన వైఖరేమిటి….? ఇదీ పొంగులేటి అభిమానులు ఎదుర్కుంటున్న సంశయం.