‘గోరు చుట్టుపై రోకలి పోటు’ అంటే ఇదే కాబోలు. అసలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంతో విలవిలలాడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మరో చేదు వార్త. ఇప్పటి వరకు కోర్టు మెట్లక్కని చంద్రబాబునాయుడికి ప్రస్తుతం పెద్ద చిక్కే వచ్చి పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రిమినల్ కేసుల్లో స్టే లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబు ఓ కేసులో తెచ్చుకున్న స్టే కాలపరిమితి ముగిసింది.
ఎప్పడో పధ్నాలుగేళ్ల క్రితం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసు ప్రస్తుతం మళ్లీ విచారణకు వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు చంద్రబాబుపై విచారణ చేపట్టింది. చంద్రబాబు గతంలో తెచ్చుకున్న స్టే ఉత్తర్వులకు పొడిగింపు తీసుకోకపోవడంతో విచారణ చేపడుతున్నట్లు ఏసీబీ ప్రత్యేక కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో లక్ష్మిపార్వతి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు పోరాటాన్ని ప్రారంభించిన నేపథ్యంలోనే ఆయనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అటు వల్లభనేని వంశీ, ఇటు దేవినేని అవినాష్ ల వ్యవహారం నుంచి టీడీపీ శ్రేణులు తేరుకోకముందే ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించడం ఆ పార్టీ వర్గీయుల్లో మరింత ఆందోళనకు దారి తీసినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్మే చింతమనేని ప్రభాకర్ అంశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. చింతమనేని ప్రభాకర్ ను పార్టీ కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు రాజకీయ విమర్శలకు దారి తీసింది. రౌడీ షీట్ తోపాటు 62 కేసులున్న ప్రభాకర్ ను రాజకీయాలకు స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునివ్వడం సిగ్గు చేటుగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అభివర్ణించారు. కాగా సీబీఐ చిటికేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటని మాజీ మంత్రి దేవినేని ఉమ సంధించిన ప్రశ్నపై జగన్ ప్రభుత్వ అనుకూల సైట్లు వెటకరిస్తున్నాయి. ‘ఇపుడెవరో చిటికేశారు’ అంటూ చంద్రబాబు తాజా పరిస్థితిపై వార్తలకు శీర్షికలు పెడుతున్నాయి. మొత్తం 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు నిప్పులా చెలామణి అవుతున్నారని వైఎస్ఆర్ సీపీ అనుకూల సైట్లు వార్తా కథనాల్లో దెప్పి పొడుస్తున్నాయి.