సున్నం రాజయ్య… జనమెరిగిన కామ్రేడ్. ప్రజలు పట్టం గట్టిన మార్క్సిస్టు నేత. నిరాడంబర జీవితం గడిపిన ప్రజాప్రతినిధి. తన తుదిశ్వాస వరకూ పీడిత, తాడిత ప్రజల కోసమే పోరాడిన నాయకుడు. భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు సీపీఎం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ నేపథ్యం. ఇటీవలే ఆయనను కరోనా మహమ్మారి కబలించింది.
అయితే ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన తెలంగాణా అసెంబ్లీలో సున్నం రాజయ్యకు కనీసం సంతాపం ప్రకటించలేదని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. ఇది సాంకేతిక కారణమా? లేక నిర్లక్ష్యమా? తేలాలని ఖమ్మానికి చెందిన బండారు రమేష్ పేరుతో సోషల్ మీడియా పోస్టు తిరుగుతోంది. దశాబ్ధాల రాజకీయ నేపథ్యంగల సున్నం రాజయ్య గురించి అసెంబ్లీలో నిజంగానే సంతాపం తెలుపలేదా? ఆయన చేసిన సేవలను స్మరించలేదా?
ఈ సందేహాలకు, వివాదానికి సోషల్ మీడియా ద్వారానే ‘కౌంటర్ పోస్టు’ తాజాగా చక్కర్లు కొడుతోంది. అసలీ వివాదమేంటో, అందుకు కౌంటర్ ఏమిటో దిగువన గల సోషల్ మీడియా పోస్టులను, చివరగా అసలు సంగతిని చదివేయండి.
ఇదీ వివాదానికి దారి తీసిన పోస్ట్: ?
రాజకీయాలకు విలువలు అద్దాడనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
స్వార్ధం ఎరుగక ప్రజా సేవ చేసాడనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
పందికొక్కుల్లా జనం సొమ్ము తినలేదనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
పచ్చని అడవుల్లో స్వచ్చంగా బ్రతికాడనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
లక్జరీ బంగళాలు కట్టించుకోలేదనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
రోలెక్స్ గడియారాలు ధరించలేదనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
కోట్లకు పడగలెత్తే విష సర్పం కాలేదనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
కోయ గూడాలకు తోడయ్యాడనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
గోదారి ఒడ్డున గిరిజన బిడ్డై పుట్టాడనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
డబ్బు మూటలకు లొంగలేదనా
మంత్రి పదవులకు ఆశ లేదనా
గిరి గీసి మరీ….. ఆఖరి దాకా
జనం కోసం బరిలోనే నిలిచాడనా
అరుణ పతాకాన్ని దేహం పైన కప్పుకొని
అరుణ తారగ నిలిచి వెలుగుతున్నాడనా
రాజయ్యకు ప్రకటించలేదు సంతాపం !
( 3 సార్లు MLA గా గెలిచి, నిస్వార్ధంగా
గిరిజన ప్రజల కోసం , పీడిత జనం కోసం జీవితాంతం కృషి చేసిన సున్నం రాజయ్య గారికి తెలంగాణా అసెంబ్లీ సంతాపం ప్రకటించక పోవడం విచారకరం. సాంకేతిక కారణమా లేక నిర్లక్షమా ? తేలాలి )
….. బండారు రమేష్, ఖమ్మం.
ఈ పోస్టుపై సహజంగానే ‘కౌంటర్’ పోస్టు వెలువడింది. అది ఇదే ?
సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలను తావు ఇవ్వకండి
? కొంతమంది తెలంగాణ శాసనసభలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే దివంగత సున్నం రాజయ్య గారి మృతి పట్ల శాసన సభ నివాళులు అర్పించలేదు అని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం.
?
తెలంగాణ శాసనసభ ఎజెండా, రెండవ పేజీలో తొమ్మిదవ అంశంగా సున్నం రాజయ్య గారి సంతాప తీర్మానం చేర్చడం జరిగింది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి, సున్నం రాజయ్య గార్లతో పాటుగా మొత్తం తొమ్మిదిమంది ప్రజా ప్రతినిధుల మరణానికి.. వారి సేవలను స్మరించుకుంటూ శాసనసభ వారికి నివాళులు అర్పించింది.
మొత్తంగా ఈ వివాదానికి సంబంధించి సీపీఎం నాయకుడొకరిని ts29 ప్రశ్నించగా, మరణించిన తాజా, మాజీ శాసనసభ్యులకు సంతాపం తెలుపుతూ అసెంబ్లీలో జరిగిన చర్చలో సున్నం రాజయ్యకు కనీస ప్రాధాన్యం లభించలేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. సంతాప చర్చ యావత్తూ ఒకే నాయకుడి చుట్టూ పరిభ్రమించిందని, మిగతా వారి గురించి ఓ నిమిషంపాటు మాత్రమే చర్చించి మ..మ… అనిపించారన్నది తమ భావనగా ఆయన పేర్కొన్నారు. సున్నం రాజయ్యకు అసలు సంతాపమే ప్రకటించలేదని తమ పార్టీ నాయకుడొకరు తొలుత పొరపాటుపడ్డారని కూడా ఆయన చెప్పారు.