శిరమున మోస్తున్న ఆకాశగంగ విరగబూసిన
క్షీరసముద్ర నిండు పొదుగులు.
గాలి జాడలకు కరిగిన
మంచు మేఘమాళికలు.
అవని తనువును అల్లుకున్న చినుకుల
మురిసిన జల్లులు.
ముసిరేసిన వానలు
దరిచేరి
మురుక్కాల్వలు పోటెత్తి
పేలిన
వరదపాతరలు.
విరుచుకుపడి నగరం నలుదిశలా విసురుకున్న జలరాశులు.
పాలిపోయిన ముఖాల
ఆధునికత
ముక్కు నేలకేసింది.
ఈదులాడుతున్న
సాధుజనుల జీవన ఆవాసాలు.
నాగరికత మేడల కూడళ్లను
చుట్టేసిన
మురుగు కంపుల చెరువుల నీళ్లు.
ఆక్రమణల నాళాల నీటిలో తానమాడుతున్న
మాయమైన కుంటల
రోడ్డు ప్రవాహాలు.
గాఢితప్పిన పాలనలో
ఆడుతున్న
పట్టణ, పల్లె ప్రగతిల జలక్రీడలు.
తేలియాడుతున్న
అద్భుత అధికార
ఇంజనీరింగ్ కట్టడ సముదాయాలు.
రెండు రోజుల వర్షాలకే
చెరువులకు గండ్లు.
కుంటలు, కాల్వలకు బుంగలు.
యేళ్ళకేళ్ళుగా ముంపు ప్రాంతాల్లో యేటాతప్పని
నిరాశ్రయుల ఆశ్రయాలు.
అవహేళన పాలైతున్న
బీటలువారిన
కిరాయి నగరీకరణలు.
పొంగిపొర్లుతున్న
అవినీతి జ్ఞానాన్ని
చూసి
నాలుగుబాటల్లో నిలబడి
నీట మునిగిన కోట్ల నిధుల
సాక్షిగా
పకపకా నవ్వుతున్న వానమ్మ.
నవ్విపోదురుగాక
నాకేంటి సిగ్గూ.
నాలుగు రోజుల్లోనే
మరిచిపోవడం మా ఇద్దరికీ కద్దూ.
✍️ రవి ® సంగోజు