పొరుగున గల ఛత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానిక చెందిన ఐదుగురు వ్యక్తులను గ్రామస్తులు అమానుషంగా కొట్టి చంపిన ఘటన ఆదివారం జరిగింది. భద్రాచలానికి 70 కిలోమీటర్ల దూరంలో గల కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మురళీగూడ క్యాంపు సమీపంలో గల ఇట్కాల గ్రామంలో ఈ అమానుషం చోటు చేసుకుంది.
గ్రామంలోని కొందరు వ్యక్తులు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు ఓ కుటుంబంపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఆవేశంతో గ్రామస్తులు బాధిత కుటుంబం ఇంటికి చేరుకుని ఇంట్లో గల మహిళలను, పురుషులను కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుప్పకూలిపోయే వరకు వారిని గ్రామస్తులు కొట్టారని, వారందరూ అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన గురించి సమాచారం అందగానే ఎస్పీ కిరణ్ చౌహాన్ తన సిబ్బందితో హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. దాడికి పాల్పడి ఐదుగురి మరణానికి కారకులైనవారిని వెంటనే అరెస్ట్ చేశారు. గ్రామస్తుల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులను మౌసం కన్న (60), మౌసం బుచ్చా (34), మౌసం బిరి, కర్కా కాచి (43), మౌసం ఆర్థో (32)గా గుర్తించారు. ఘటనకు దారి తీసిన పూర్తి కారణాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.