బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) పి. సుందర్ రాజ్ మరో సంచలన ప్రకటన చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మరో ఐదుగురు నక్సలైట్లు కూడా సొంత పార్టీ కార్యకర్తల చేతుల్లోనే చంపబడ్డారనేది ఆయన కథనం. మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ సభ్యుడు మొడియం విజ్జాను సహచర నక్సల్స్ హత్య చేసినట్లు ఈనెల 2వ తేదీన సంచలన ప్రకటన చేసిన బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తాజాగా అదే తరహాలో మరో సంచలన ప్రకటన చేయడం గమనార్హం.
విజ్జాను కాల్చి చంపిన పరిణామాల్లోనే మరో అయిదుగురు నక్సలైట్లను కూడా సహచరులే కాల్చి చంపారని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించి తమకు నమ్మకమైన సమాచారం ఉందని, ఘటనపై దర్యాప్తు కూడా చేస్తున్నామన్నారు. ఈ కాల్పుల్లో మరణించినవారి పేర్లను కూడా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.
గంగళూరు ఏరియా కమిటీ ఇంచార్జి, డివిజనల్ కిమటీ సభ్యుడు మొడియం విజ్జాతోపాటు జనమిలీషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్ సందీప్ అలియాస్ బుధారాం కుర్సం, మావోయిస్టు పార్టీ జనతన సర్కార్ స్కూల్ ఇంచార్జ్ లఖు హేమ్లా, డీఏకేఎంఎస్ రేంజ్ కమిటీ అధ్యక్షుడు సంతోష్, దొడి తూంనూర్ జనతన సర్కార్ అధ్యక్షుడు దస్రు మండవి, వెస్ట్ బస్తర్ లోని పిడియా ఏరియా మిలీషియా ప్లాటూన్ కమాండర్ పూనెం కమ్లు మరణించిన వారిలో ఉన్నట్లు ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.
ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను హత్య చేస్తున్న ఘటనలపై మావోయిస్టు సాయుధ దళాల్లో తీవ్ర విభేదాలు పొడసూపాయని, దాని ఫలితంగా ఏర్పడిన ఘర్షణలో ఆయా పేర్లు గల తమ సహచరులను మావోయిస్టు నక్సలైట్లు కాల్చి చంపారన్నారు. దీంతో ఆయా ఘటనలో హత్యకు గురైన నక్సలైట్ల సంఖ్య ఆరుకు పెరిగినట్లు చెప్పారు. ఈ కాల్పుల ఘటనపై మరింత సమాచార సేకరణకు తాము ప్రయత్నిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఘటనకు సంబంధించి బస్తర్ ఐజీ ఏమంటున్నారో దిగువన గల వీడియోలో కూడా చూడవచ్చు.