ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించతలపెట్టిన ఇఫ్తార్ విందుకు ఖమ్మంలో అనూహ్య పరిణామం ఎదురైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేట్ తాకనివ్వనని పదేపదే శపథం చేస్తున్న పొంగులేటి ఇఫ్తార్ విందుకు తక్లీబ్ (ఇబ్బంది) ఏర్పడినట్లు ఆయన క్యాంపు కార్యాలయమే స్వయంగా ప్రకటించడం గమనార్హం. దీంతో ఈ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించాల్సిన ఇఫ్తార్ విందును పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాయిదా వేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే అంశంపై పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబూరి దయాకర్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనను దిగువన చదివితే క్లారిటీ వస్తుంది.
ఖమ్మం నియోజకవర్గ ముస్లిం సోదరులకు మనవి
ఈ రోజు అనగా ది: 16-04-2023న ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఖమ్మం నగరంలోని సెయింట్ మేరీస్ స్కూల్ ఆవరణలో గల ఫంక్షన్ హాల్లో ఖమ్మం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఇవ్వదలచిన ఇఫ్తార్ విందును వాయిదా వేయడం జరిగింది. కొంతమంది నేతల ఒత్తిడి కారణంగా వేదికను ఇచ్చేందుకు సెయింట్ మేరీస్ స్కూల్ నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఇఫ్తార్ విందును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. తదుపరి తేది, వేదికను త్వరలోనే ప్రకటిస్తాం. ముస్లిం సోదరులు గమనించగలరని మనవి.
ఇట్లు
తుంబూరు దయాకర్ రెడ్డి
పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ
ఫొటో: ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్)