ఖమ్మం నగరానికి ఆనుకుని ఉన్న పెదతండాకు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ పేషెంట్ తో కలిసి గత నెల 17వ తేదీన న్యూఢిల్లీ నుంచి కాజీపేట వరకు తెలంగాణా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించాడు. మరుసటి రోజు అంటే 18వ తేదీన సాయంత్రం 6.15 గంటలకు అతను కాజీపేట నుంచి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించి ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగాడు. అక్కడి నుంచి స్టేషన్ రోడ్డులోని ఓ టీ స్టాల్ వద్దకు వెళ్లి, స్నేహితుల వద్ద బస చేశాడు. దిన చర్యలో భాగంగా 19వ తేదీన ఖమ్మం నగరంలోని ఓ కళాశాల వద్ద గల టీ స్టాల్ వద్దకు వెళ్లి, అక్కడి నుంచి పక్కనే గల ఓ డీటీపీ సెంటర్ కు వెళ్లాడు. 20వ తేదీన నగరంలోని ఓ టీ స్టాల్ వద్దకు వెళ్లి టిఫిన్ చేశాడు. 21వ తేదీన పెదతండాలోని తన నివాసంలోనే ఇద్దరు స్నేహితులను కలుసుకున్నాడు. 22వ తేదీన స్థానికంగా మరణించిన ఓ నాయకుడి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 23వ తేదీన ఖమ్మం రూరల్ మండలంలో, 24 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని నేలకొండపల్లి మండలంలోని పలు ప్రార్థనా స్థలాలకు వెళ్లాడు. ఏప్రిల్ 1వ తేదీన ఖమ్మం నగరంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వ్యక్తిని 2వ తేదీన ఐసొలేషన్ కేంద్రానికి పరీక్ష కోసం తరలించారు. ఇతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు సోమవారం పరీక్షల నివేదిక ద్వారా వెల్లడైంది.

ఖమ్మం నుంచి కరోనా బాధితున్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

దీంతో ఒక్కసారిగా ఖమ్మం నగరంతోపాటు జిల్లా యావత్తూ ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు సింగిల్ కరోనా పాజిటివ్ కేసు లేదని, తాము సురక్షితంగానే ఉన్నామని భావించిన ప్రజల్లో అలజడి ప్రారంభమైంది. ఆందోళన నెలకొంది. అప్రమత్తతను తెలియజేసింది. అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. వెనువెంటనే జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే పెదతండా, సమీపంలోని జలగంనగర్, నాయుడుపేట ప్రాంతాలను రెడ్ జోన్లుగా పరిగణిస్తున్నట్లు అధికార యంత్రాంగమే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు రావద్దని, అధైర్యపడవద్దని, ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను తామే ఇంటి ముందుకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే కరోనా బాధితుని నివాస ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ సందర్శించారు. అధికారగణానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక్కడితో ఈ సీన్ కట్ చేద్దాం.

ప్రజలకు సూచన.. పుకార్లు నమ్మకండి
ఖమ్మం పెద్ద తండా కు చెందిన ఒక వ్యక్తి కి కరోనా పాజిటివ్ అనేది వాస్తవమే కాని అతను గత 20 రోజుల నుండి ఖమ్మం లో లేడు…
15 రోజుల క్రితం రైలులో మర్కత్ నుండి వస్తున్న రషీద్ అనే వ్యక్తి ఉన్న కంపార్ట్మెంట్ లో ప్రయాణించాడు.నిఘా విభాగం సూచన మేరకు మధిర రైల్వే స్టేషన్ లో పోలీసులు ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న అందరినీ క్వారంటైన్ కు తరలించారు.. ఆ బోగీని క్లోరోక్విన్ తో శుభ్రపరిచారు.. గత మూడు రోజుల నుండి ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు కనపడగా ఐసోలేషన్ వార్డుకు తరలించారు.. పరీక్షలలో పాజిటివ్ అని వచ్చింది…
అయితే గత 20 రోజులుగా అతను ఖమ్మం లో లేడు కాబట్టి ఖమ్మం లో కాని, పెద్ద తండా లో కాని ఎవరినీ కలవలేదు.. కాబట్టి ఎవరూ పుకార్లు ప్రచారం చేయవద్దు… అనవసర సందేహాలకు తావు ఇవ్వొద్దు…
స్వీయ నిర్బంధాన్ని పాటించి కరోనాని పారద్రోలుదాం….

రెడ్ బాక్సులోని ఆయా వాట్సాప్ పోస్టును చదివారు కదా? కరోనా బాధితుని గురించి సమాచారం బయటకు పొక్కిందే తడవుగా ఖమ్మం నగరానికి చెందిన ఓ పత్రికా విలేకరి అత్యుత్సాహంతో చేసిన పోస్ట్ ఇది. పుకార్లు నమ్మవద్దని సూచనలు చేస్తూనే, తానే పుకారు సారాంశంతో, నిరాధార సమాచారంతో కూడిన పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. కరోనా బాధితుడు గడచిన 20 రోజులుగా ఖమ్మం నగరంలో లేడని, అందువల్ల ఖమ్మంలోగాని, పెద తండాలోగాని అతను ఎవరినీ కలవలేదని తేల్చేశాడు.

కానీ కరోనా బాధితుడు గత నెల 14వ తేదీన ఖమ్మం నుంచి బయలుదేరింది మొదలు, 15వ తేదీన ఢిల్లీలో దిగిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు? ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు? 17వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగేవరకు ప్రతి అడుగు జాడను వివరిస్తూ పోలీస్ నిఘా వర్గాలతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కూడా ఓ నివేదికను రూపొందించింది. ఖమ్మం నగరంలోనే కాదు, జిల్లాలోని ఏయే మండలాల్లో, మరే గ్రామాల్లో అతను తిరిగిందీ పూసగుచ్చినట్లు ఆయా నివేదికల్లో వివరించారు. కానీ ఆయా నివేదికలకు విరుద్ధంగా ఓ విలేకరి, అందునా బాధ్యతాయుత పదవిలో ఉన్నట్లు చెప్పుకునే వ్యక్తి చేసిన ఈ వాట్సాప్ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో జర్నలిస్టు సోషల్ మీడియాలో చేసిన పోస్టును దిగువన పరిశీలించండి.

మీడియా మిత్రులకు నమస్కారం
గిరిజన నాయకుడు కొంత మంది మీడియా మిత్రులకు సన్నిహితులు.. ఈ ఆపత్కాల సమయంలో ఎవరైనా మీడియా మిత్రులు దగ్గరగా ఉండి ఉంటే బేషరతుగా అధికారుల దగ్గరకు వెళ్లండి…. కరోనా వ్యాప్తి నిరోధానికి సహకరించండి… చేయి దాటితే… ఆపడం ఎవరి తరం కాదు… మీడియా ద్వారా సమాజహితం కోరే నిజమైన జర్నలిస్టులు అయితే గిరిజన నాయకునితో కలిసిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన భాధ్యతలను సక్రమంగా నిర్వహిద్దాము. గిరిజన నాయకుడు చెప్పిన తరువాత తప్పు చేసిన దోషిగా క్వారంటైన్ కు వెళ్లడం కన్నా… మగధీరుడిలా మనకు మనమే వెళితే గౌరవం ఉంటుంది… థ్యాoక్యూ
మీ హితంతో పాటు సమాజ శ్రేయస్సును కోరుకునే
మీ…
నాగేoదర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్టు

విషయం అర్థమైంది కదా? ఖమ్మం నగరంలో తొలి కరోనా పాజిటివ్ కేసు ప్రస్తుతం ఎక్కువగా మీడియా సోదరులనే కలవరానికి గురిచేస్తోంది. ఎందుకంటే కరోనా బాధితుడు తన పోరాట కార్యక్రమాల్లో భాగంగా నిత్యం రెండు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లోనేగాక, మీడియా ప్రతినిధులు ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరించేవాడనే ప్రచారం ఉంది. కొందరు విలేకరులకు సన్నిహితుడనే వాదన కూడా ఉంది. (ఫింక్ కలర్ బాక్స్ ఐటెమ్ లో విలేకరి నాగేందర్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు) అయితే ఢిల్లీ నుంచి వచ్చాక ఈ కరోనా బాధితుడు ఎంత మంది విలేకరులతో ఎప్పటిలాగే సన్నిహితంగా మెలిగాడనే ప్రశ్నకు మాత్రం ప్రస్తుతం జవాబు లేదు. ఎందుకంటే మీడియా మిత్రులతో సత్సంబంధాలు దెబ్బ తింటాయనే భావనతో కరోనా బాధితుడు నోరు మెదపడం లేదనే వాదన వినిపిస్తోంది.

అయినప్పటికీ ప్రభుత్వ అధికార యంత్రాంగం తన పని తాను చేసుకుపోతోంది. బాధితుని మొబైల్ కాల్ లిస్ట్, కదలికలను బేస్ చేసుకుని కూపీ లాగుతోంది. బాధితునితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించిన 53 మందిని నిన్ననే క్వారంటైన్ కు తరలించారు. ఇదే దశలో కరోనా బాధితునితో సంబంధాలు గల వారు దాదాపు 500 మంది వరకు ఉండవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా అంచనా వేస్తోందట. ఈ వార్తా కథనం రాసే సమయానికి తాజాగా మంగళవారం మరో ఏడుగురిని అధికార యంత్రాంగం క్వారంటైన్ కు తరలించిందని, అందులో ఇద్దరు విలేకరులు కూడా ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం ధ్రువపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మీడియాలో బాధితుడు ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే అంశంపై ఇంటలిజెన్స్ వర్గాలు మరోవైపు ఆరా తీస్తున్నాయి. దీంతో ఖమ్మం మీడియా సర్కిళ్లలో ఎడతెగని టెన్షన్ ఏర్పడింది. ముఖ్యంగా కరోనా బాధితునితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు ప్రచారంలో గల విలేకరులు నానా హైరానా పడుతున్నట్లు తెలుస్తోంది.

Comments are closed.

Exit mobile version