తెలంగాణా రాష్ట్రంలోనే తొలి చిన్న పిల్లల కోవిడ్ సెంటర్ బుధవారం ఏర్పాటు కాబోతున్నది. కరోనా థర్డ్ వేవ్ ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణా కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 3వ దశ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్రంలోనే చిన్నపిల్లల కోసం మొదటి ఆసుపత్రిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రం(MCH)లో ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కోవిడ్ సంరక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ మధ్యాహ్నం 03.00 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.