చదివారుగా మంత్రి గంగుల కమలాకర్ చేసిన తాజా ప్రకటన. ‘ధరణి’ పోర్టల్ లో నమోదు కాని ఆస్తులను ప్రభుత్వం తీసుకుంటుందనేది ఆయన చేసిన ప్రకటన సారాంశం. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తుతానికి ఇక్కడి వరకు వదిలేసి, అందులో గల అసలు మర్మమేమిటో వార్తా కథనం చివరలో మళ్లీ ప్రస్తావించుకుందాం. ఇక అసలు విషయంలోకి వెడితే…
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి వేర్వేరు రంగుల్లో పాస్ పుస్తకాలను ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. వ్యవసాయేతర భూములకు మెరూన్ కలర్ పాసు బుక్కులను ఇవ్వాలని సర్కారు సార్లు నిర్ణయించారు. పాస్ పుస్తకాల రంగు ఏదైతే అది కానివ్వండి.., కానీ ఆస్తుల నమోదుకు సంబంధించి సామాన్యు ప్రజల సంగతేమోగాని, సామాన్యులుగా చెప్పుకునే అసామాన్య జర్నలిస్టులు కొందరు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రంగా కలవరపడుతున్నారు. మథనపడిపోతున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
ఎందుకంటే…? చాలా మంది జర్నలిస్టుల జీవితాలు తెరిచిన పుస్తకాలేమీ కాదు. అన్నివర్గాల్లో మాదిరిగానే జర్నలిస్టుల్లోనూ భిన్న రకాల వ్యక్తులుంటారనేది కొత్త విషయమేమీ కాదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణా సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం కొందరు జర్నలిస్టులను బాగా భయపెడుతోంది. ‘ధరణి’ వెబ్ సైట్ పేరు వింటేనే ఆయా జర్నలిస్టులు చలి జ్వరం వచ్చివారిలా వణికిపోతున్నారు. ఖమ్మం నగరంలో నివసించే ఓ జర్నలిస్టు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగిని కలిసి ఏమంటారంటే…
‘నాకు నల్లగొండలో, మిర్యాలగూడలో, ఖమ్మంలో, హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి. వాటిని నమోదు చేయాల్సిందేనా? అన్ని ఆస్తులూ తప్పకుండా నమోదు చేయించుకోవలసిందేనా? ఇందులో మినహాయింపులేమీ ఉండవా? అని ఆరా తీశాడుట. విషయం అర్థమైందిగా…? కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ వెబ్ సైట్ వివిధ వర్గాలవారినే కాదు, చివరికి జర్నలిస్టులనూ ఇలా భయపెడుతోందన్నమాట.
జర్నలిస్టులు ఎందుకు భయపడాలి… అని ప్రశ్నిస్తే…? మనోళ్లు చాలా మంది ఏదో ఒక మార్గాన ‘నాలుగు రాళ్లు’ వెనకేసుకుని పోగేసుకున్న బాపతు ఆస్తులన్నమాట. ఇవన్నీ ధరణిలో నమోదైతే, ఆస్తుల చిట్టా యాజమాన్యానికి తెలిస్తే…? ఇంకేమన్నా ఉందా? సర్వం గోవిందా! ఉన్న ఉద్యోగానికీ ముప్పు రావచ్చు. ప్రజలు భావించినట్లు జర్నలిస్టులందరూ నిష్కలంకులు కాదనే విషయం బట్టబయలు కావచ్చన్నమాట.
ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రకటనను మరోసారి గుర్తు చేసుకుంటే… ధరణి పోర్టల్ లో నమోదు కాని ఆస్తులను ప్రభుత్వం తీసుకుంటుందా? లేదా? అనేది మున్ముందు తేలుతుంది. కానీ ఏయే జర్నలిస్టుకు ఎక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయి? మరెన్ని ప్లాట్లు ఉన్నాయి? అనే వివరాలు మాత్రం ఖచ్చితంగా వెల్లడవుతాయి. తద్వారా కనీసం నిలువ నీడలేకుండా, ఇండ్లు లేని జర్నలిస్టులెవరో కూడా బహిర్గతమవుతుంది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో చాలా మంది జర్నలిస్టుల ఆస్తులెన్నో ఇప్పుడు తేటతెల్లమవుతుంది. అంటే మా వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి సారూ… అంటూ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లంటేనే జర్నలిస్టు సంఘాల నేతలు ఆలోచించాల్సిన పరిస్థితులు అనివార్యమవుతాయి. జర్నలిస్టులే కాదు, తమకు ఇళ్లు లేవని వాదించే ఇతర వర్గాలకు చెందిన చాలా మంది బాగోతం కూడా ధరణి పోర్టల్ ద్వారా తేలిపోతుందన్నమాట.
అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే… జర్నలిస్టులే కాదు, భిన్న వర్గాలకు చెందిన చాలా మంది తమ ఆస్తులను ‘ధరణి’ పోర్టల్ లో దాపరికం లేకుండా నమోదు చేసుకుంటారా? ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన ప్రకారం తమ ఆస్తులను చేజేతులా ప్రభుత్వానికి అప్పగిస్తారా? ఇదీ అసలు సందేహం. అద్భుతం కదా ధరణి యోచన. పోలా… అదిరిపోలా…! కేసీఆర్ సార్ ఆలోచన!!