జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రభుత్వాధికారులు సీజ్ చేశారు. జగిత్యాల పార్క్ సమీపంలో గల ఓ ఫాస్ట్ సెంటర్ నిర్వాహకులు వంట పాత్రలను డ్రైనేజీ కాల్వలోని వాటర్ ద్వారా శుభ్రం చేస్తున్న ఘటనకు సంబంధించి ts29.in వీడియోతో సహా ఈరోజు 12.24 గంటల ప్రాంతంలో వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి, విషయాన్ని నిర్ధారించుకుని ఆయా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను సీజ్ చేశారు. కొద్ది గంటల ముందు ts29.in ప్రచురించిన వార్తా కథనాన్ని, వీడియోను దిగువన చదవవచ్చు, చూడవచ్చు.

ఫాస్ట్ ఫుడ్ ‘కరోనా’? జర వీడియో దేఖోనా!

అసలే కరోనా భయం వెంటాడుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుభ్రత, పరిశుభ్రత గురించి శానిటైజర్లు ఖాళీ అయ్యేలా, సబ్బులు అరిగేలా సర్కారు మొత్తుకుంటూనే ఉంది. కానీ రోడ్డు పక్కన పొట్ట పోసుకునే చిరు వ్యాపారుల్లో మాత్రం కరోనా అంశంలో ఏ మాత్రం చలనం వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

కావాలంటే దిగువన గల వీడియో చూడండి. కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాల్వలో ఫాస్ట్ ఫుడ్ తయారీకి ఉపయోగించే పాత్రలను ఈ యువకుడు ఎలా శుభ్రం చేస్తున్నాడో? ఇది ఎక్కడో ముంబయిలోనో, కలకత్తాలోనూ తీసిన వీడియో కాదు. తెలంగాణాలోని జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్క్ ముందు సాక్షాత్కరించిన దృశ్యం. ఆ పాత్రలు ఫాస్ట్ ఫుడ్ తయారీకి ఉపయోగించేవని చెప్పడానికి రుజువు ఏమిటీ? అనే సందేహం కలిగితే మాత్రం వీడియోను మళ్లీ ఓసారి చూసి పక్కనే గల కోడిగుడ్ల ట్రే లను కూడా గమనించండి.

Comments are closed.

Exit mobile version