గుత్తులు గుత్తులు
గుంపులుగా
విరగబూసిన
ఆకుపచ్చ సమ్మోహన సమూహాలు.
అలలు అలలుగా
విసురుతున్న
గిరుల విరుల పచ్చి వాసనలు.
ఆకాశమంతా అల్లుకున్న పుట్టతేనెల మకరందాలు.
అర్థరాత్రి అందాల
కనువిందులు చేస్తున్న
కలువపూల వెన్నెల కాంతులు.
పక్షుల ఈకల్లా
అక్కడక్కడా
అడవి అంతర్భాగమైన పిట్టగూళ్ళు.
రెల్లుగడ్డి పరుసుకున్న
పైకప్పుల పూరిల్లు.
గూడెం గురుతుల్లో
ఎగురుతున్న గువ్వల రెక్కలు.
పోడుచేను కొప్పుల్లో
మోగుతున్న జడగంటల చప్పుళ్ళు.
మంచెల మసక చీకట్లో
జంటలు
పంచుకొంటున్న పరువాలు.
లేగదూడలు
కట్టుకున్న కాలిమువ్వల్లా సెలయేరుల హొయలు.
ఛంగుఛంగుమనెగురుతున్న
లేళ్ళ గిట్టలు రేపుతున్న
ధూళి మేఘాలు.
పసుపు వన్నె పడతుల
మయూర వయ్యారాలు.
రే రేలరేలంటూ
అడుగులేస్తున్న ఆడవి పరవళ్లు.
అడుగులో అడుగులై
ఆడుతున్న తుడుం మోతలు.
ప్రతిధ్వనిస్తున్న పల్లవులు,
చెట్టు పుట్టలను
అల్లుకుంటున్న కోరసులు.
ఒంటినిండా బట్టల్లేని
పచ్చనాకుల మాటున దాగిన
పసిడి మొగ్గలు.
వొంచిన వెదురు బద్దలకు
బిగించిన వింటినారీ తీగలు.
నమ్మితే ప్రాణాలిచ్చే
ఒంటికి వేలాడుతున్న విల్లంబులు.
అత్మగౌరవ పతాకమై ఎగిరే
జంగ్ సైరన్లు.
పుట్టమట్టిలో పూసిన
కొండమల్లెల మనసు పరిమళాలు.
అరణ్యాల్లో మొలిచి
అంతరాల్లో విరగ్గాసిన
విశాల గుండెకాయలు.
అడవి మెడలను,
ఆదివాసీ కుత్తుకలను కత్తిరిస్తున్న తేనెపూసిన కత్తులు.
ఊడలు దిగిన నాగరికత చుట్టేస్తున్న అక్కడి వనరులు.
పారిస్తున్న ఆదివాసీల రక్త కన్నీరు.
✍️ రవి ® సంగోజు
(ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా)