శరీర దారుఢ్య ప్రియులకు శుభవార్త. బాడీ బిల్డింగ్ పోటీల్లో మిస్టర్ వరల్డ్-2019 గా నిలిచిన చిత్తరేష్ నటేషన్ ఖమ్మంలో అందుబాటులో ఉంటున్నారు. ఒక్కరోజు కాదు, రెండ్రోజులు కాదు ఏకంగా దాదాపు నాలుగు నెలలపాటు ఆయన ఖమ్మం నగరంలోనే మకాం వేస్తున్నారు. మరోసారి ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో తన సత్తా చాటేందుకు ఖమ్మంలోని హెల్త్ లైన్ జిమ్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు. ఇందుకోసం ఆయన ఈనెల 12న ఖమ్మం రానున్నారు.
మొదట్లో హాకీ క్రీడాకారుడైన చిత్తరేష్ నటేషన్ ఫిట్ నెస్ కోసం జిమ్ కు వెళ్లి ఏడేళ్ల కాలంలోనే గండర గండడుగా గుర్తింపు పొందారు. ప్రపంచ నంబర్ వన్ బాడీ బిల్డర్ గా విజయం సాధించారు. కేవలం ఏడాది వ్యవధిలోనే మిస్టర్ ఆసియా, మిస్టర్ యూనివర్స్ లో నంబర్ వన్ గా నిలిచారు. రెండేళ్లక్రితం అంటే 2018లో వరుసగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ద్వారా చిత్తరేష్ నటేషన్ ఆయా విజయాలను తన సొంతం చేసుకున్నారు. పాలుపోసుకుని జీవించే సాధారణ కుటుంబంలో జన్మించిన నటేషన్ శరీర దారుఢ్యంపై మక్కువను ప్రదర్శించి ,ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. ఈనెల 12వ తేదీన ఖమ్మం చేరుకుంటున్న ఆయన నెలల తరబడి మకాం వేయనున్నారు.
వచ్చే మే నెల వరకు ఆయన ఇక్కడే ఉంటారని, మరోసారి ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ, ప్రిపేర్ కానున్నారని ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, హెల్త్ లైన్ జిమ్ అధినేత, ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ చెప్పారు. బాడీ బిల్డింగ్ గురించి నటేషన్ ఈనెల 13వ తేదీ నుంచి ఔత్సాహికులకు మెళకువలు నేర్పుతూ, శిక్షణ కూడా ఇస్తారని ఆయన చెప్పారు. ఆసక్తి గల వారు 93993 11713 మొబైల్ నెంబర్ ద్వారా తనను సంప్రదించవచ్చని స్వామి రమేష్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు.
కాగా నటేషన్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే దిగువన గల వీడియో లింక్ ద్వారా వీక్షించవచ్చు.